
ఒకప్పుడు ఒక మనిషి చనిపోయాడు అంటే.. ఆ వ్యక్తిని ఆఖరి చూపు చూడటానికి, దు:ఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఓదార్చేందుకు వందల మంది వచ్చేవారు. చనిపోయిన వ్యక్తికి అత్యంత దగ్గరిగా మెలిగిన వ్యక్తులు ఆ బాధ నుంచి తేరుకునేవరకు బంధువులు, ఫ్రెండ్స్ పక్కన ఉండేవారు. కానీ కరోనా సమయంలో చావు స్థాయి తగ్గిపోయింది. సొంత మనిషి చనిపోయినా… బంధువులు రాని దీనస్థితి. పక్కింటివారు కనీసం తొంగి చూడని పరిస్థతి. అలా ఎన్నో శవాలను మున్సిపల్, పంచాయతీ అధికారులే ఖననం చేశారు. కరోనా అనంతరం ఇప్పుడు గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి. ఎవరికి ఎప్పుడూ ఏమవుతుందో తెలియదు. నవ్వుతూ ఉన్నవారు ఒక్కసారిగా కూలిపోతున్నారు. నిన్న ఉన్నవారు నేటికి గోడలకు ఫోటోలుగా మారిపోతున్నారు. కొందరు… దగ్గరివారు చనిపోతే కూడా రావడం లేదు. వీడియో కాల్‌లోనే ఆఖరి చూపులూ అయిపోతున్నాయి. సోషల్ మీడియాలో RIP అని ఓ పోస్ట్ వేసి వదిలేస్తున్నారు. సాయంత్రానికి శవం మాయం అయిపోతుంది. ఆ ఇంటి వద్ద ఒక్క వ్యక్తి కూడా కనిపించడం లేదు. ఇక కోల్పోయిన వ్యక్తి గురించి పక్కనబెడితే.. అతనికి అత్యంత దగ్గరగా మెలిగిన వ్యక్తుల్ని ఓదార్చేందుకు ఒక్కరూ ఉండటం లేదు. ఈ క్రమంలోనే కొందరు డిప్రెషన్‌లోకి వెళ్లి ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రేమించినవారిని కోల్పోయిన బాధను దిగమింగలేక విలవిల్లాడుతూ ప్రాణాలు తీసుకుంటున్నారు.
సీరియల్ నటుడు చందు ఆత్మహత్య ఆ కోవకు చెందినదే. త్రినయని సీరియస్ చేసే సమయంలో మొదలైన చందు-పవిత్రల పరిచయం.. గాఢమైన అనుబంధానికి దారి తీసింది. అప్పటి నుంచి భార్యపిల్లల్ని పక్కనబెట్టాడు. నైతికంగా అతను చేసింది తప్పే. కానీ ఎమోషనల్‌గా మరొకరికి గాఢంగా కనెక్ట్ అయిపోయాడు. ఆరేళ్ల బంధం.. అప్పటివరకు కారులో తన పక్కనే ఉన్న వ్యక్తి.. యాక్సిడెంట్ కావడంతో కొద్ది క్షణాల్లోనే విగతజీవిగా మారిపోయింది. ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఆమెతో కలిసి ఉన్న జ్ఞాపకాలు అతడిని వెంటాడాయి. పగలూ, రాత్రి ఆమె ఆలోచనల్లోనే మునిగితేలాడు. పవిత్రను గుర్తుకుతెచ్చుకుంటూ ఆమెతో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ.. ఎమోషనల్ పోస్టులు పెట్టాడు. ఓ పోస్ట్‌లో అతని సూసైడ్ ఆలోచనలు స్పష్టంగా కనిపించాయి. “నాన్న.. రెండు రోజులు వెయిట్ చెయ్..” అంటూ అందులో పేర్కొన్నాడు. చనిపోయే ముందురోజు ఇక తాను బతకనని తండ్రికి చెప్పాడు. చివరకు పవిత్ర లేదన్న బాధను భరించలేక, పవిత్ర ఆలోచనల నుంచి బయటకు రాలేక.. తీవ్ర డిప్రెషన్‌కు లోనై ప్రాణాలు తీసుకున్నాడు.
ఇలాంటి టెండెన్సీలో ఉన్నవారిని ఒంటరిగా వదిలేయకూడదు. అత్యంత ఆప్తులను కోల్పోయినవారు తీవ్రమైన దు:ఖంలో ఉంటారు. ఈ ప్రపంచంలో తమకు ఇంకా ఏం మిగిలి లేదు అనిపిస్తూ ఉంటుంది. చనిపోయిన వ్యక్తితో బ్రతికిన క్షణాలు వారిని వెంటాడుతూ ఉంటాయి. మరో పని వైపు ధ్యాస మల్లదు. నైరాస్యం అలుముకుంటుంది. అందుకే ఇద్దరు.. ముగ్గురు మిత్రులు, బంధువులు.. కొన్నాళ్ల పాటు పక్కనే ఉంటూ ధైర్యాన్ని నూరిపోయాలి. నలుగురిలో కలిసేలా ప్రొత్యహించాలి. పరిస్థితి తీవ్రంగా ఉందని భావిస్తే.. కౌన్సిలింగ్ ఇప్పించాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.