భారీ బడ్జెట్‌తో వస్తున్న ఆదిపురుష్‌పై యమక్రేజ్ ఏర్పడింది. ప్రభాస్ హీరోగా దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన మైథలాజికల్ మూవీ కావడంతో.. భారీ అంచనాలున్నాయి. రామాయణం ఆధారంగా తెర కెక్కిన ఎన్నో సినిమాలు ఇప్పటి వరకు అలరించినా.. ఆదిపురుష్ ఇందుకు భిన్నంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే ఈ సినిమాను ఎన్నడూ లేనంతగా ప్రమోషన్ చేస్తున్నారు.
ఇప్పటికే వేలాది టికెట్లు కొన్న ప్రముఖులు.. ప్రేక్షకులకు ఉచితంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ కూడా తనవంతుగా 10వేల టికెట్లను పేద పిల్లలకు ఉచితంగా ఇస్తున్నారు. ముంబై వాడల్లో ఉండే పేదవారికి, అనాథలకు ఈ సినిమాను చూపించాలని ఫిక్సయ్యారు. సినిమాకు పాన్ ఇండియా తరహాలో ప్రమోషన్ వస్తుండడంతో ఆదిపురుష్‌పై అంచనాలు మరింత పెరుగుతూ పోతున్నాయి.
ఆదిపురుష్ సినిమా టికెట్ ధర పెంపునకు అనుమతి ఇచ్చింది తెలంగాణ సర్కార్. రోజుకు 6 షోలకు తెలంగాణ సర్కార్ పర్మిషన్ ఇచ్చింది. మొదటి 3 రోజుల వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లకు స్పెషల్ ఆఫర్ ఇచ్చింది సర్కార్. టికెట్ ధరను రూ. 50 పెంచుకునేలా వెసులుబాటు కల్పించింది. ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్ విడుదలవుతున్న విషయం తెలిసిందే.