తమిళ హాస్య నటుడు వివేక్ హఠాన్మరణంపై పలువురు తమిళ రాజకీయ, సినీ ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. వివేక్ రెండ్రోజులక్రితమే కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. అందరూ తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం గుండెపోటు రావడంతో చెన్నై వడపళనిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన్ను అడ్మిట్ చేయించారు. చికిత్సా ఫలితం లేకుండా శుక్రవారం వేకువజామున కన్నుమూశారు. ఆయన వయస్సు 59 ఏళ్లు.
ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన ప్రముఖ దళిత నేత(వీసీకే పార్టీ అధినేత), ఎంపీ తిరుమావళవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేక్ మరణంపై పలు ప్రశ్నకు సమాధానం రావాల్సి ఉందని పేర్కొన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వివేక్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయినట్లు జరుగుతున్న ప్రచారంతో ప్రజల్లో ఆందోళన నెలకొంటున్నట్లు పేర్కొన్నారు. దీనిపై తమిళనాడు ప్రభుత్వం తగిన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివేక్ మరణానికి అసలు కారణాలు ఏంటో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. వివేక్ మరణం తనను దిగ్ర్భాంతికి గురిచేసినట్లు తిరుమావళవన్ పేర్కొన్నారు.
అటు వివేక్ మరణంతో తమిళ సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు వివేక్ భౌతికకాయానికి నివాళులర్పించారు.
ఇవి కూడా చదవండి.. ప్రముఖ హాస్యనటుడు వివేక్ ఆకస్మిక మరణం.. చిత్రపరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతి..