కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూశారు. మార్చి 29న అర్దరాత్రి గుండెపోటుతో మరణించారు. శుక్రవారం అర్దరాత్రి ఛాతినొప్పితో అస్వస్థతకు గురికాగా.. వెంటనే కుటుంబసభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుతపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరేలోపే అతడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. 48 ఏళ్ల వయసులో డేనియల్ బాలాజీ హఠాన్మరణం సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నింపింది. బాలాజీ మరణంపై సినీ ప్రముఖులు, అభిమానులను తీవ్ర దిగ్భాంతికి గురి చేసింది. డేనియల్ బాలాజీ మృతి పట్ల పలువురు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. డేనియల్ బాలాజీ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో మొత్తం యాభైకి పైగా సినిమాలు చేశాడు. చిత్రాల్లో ఎక్కువగా విలన్ రోల్స్ చేశాడు.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన సాంబ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత వెంకటేష్ నటించిన ఘర్షణ, చిరుత, నాగ చైతన్య, సాహసం శ్వాసగా సాగిపో సినిమాల్లో కీలకపాత్రలలో నటించారు. న్యాచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ సినిమాలో మెయిన్ విలన్ గా నటించారు. తెలుగులో అదే అతడి చివరి సినిమా. టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసింది తక్కువ సినిమాలే అయినా తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్నాడు.
2001లో చితి సీరియల్‌తో బుల్లితెరపైకి అడుగుపెట్టాడు. ఇందులో డేనియల్ పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత 2002లో రొమాంటిక్ డ్రామా ఏప్రిల్ మధతిల్ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. డైరెక్టర్ గౌతమ్ మీనన్ తెరకెక్కించిన కాకా, ఫ్రాధు ఫ్రాదు చిత్రాల్లో నటించి అభిమానులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నెగెటివ్ రోల్స్‌లో నటించాడు. డేనియల్ బాలాజీ.. ప్రముఖ దర్శకుడు, నిర్మాత సిద్దలింగయ్య సోదరి కుమారుడు. చెన్నైలోని తారామణి ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో డైరెక్షన్ కోర్సు పూర్తి చేసిన బాలాజీ టెలివిజన్ సీరియల్స్‌లో నటించారు. ఈరోజు పురసైవల్కంలోని ఆయన నివాసంలో భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.