
సంక్రాంతి కానుకగా తమిళంలో విడుదలైన సినిమాల్లో ‘అయలాన్’ ఒకటి. కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ నటించిన ఈ సినిమా జనవరి 12న థియేటర్లలో రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఈ చిత్రానికి రవికుమార్ దర్శకత్వం వహించారు. 2016లో ఈ మూవీని అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ మూవీ విడుదలకు దాదాపు ఎనిమిదేళ్లు సమయం పట్టింది. వీఎఫ్‌ఎక్స్ వర్క్‌లు, ఆర్థిక ఇబ్బందులు వంటి పలు కారణాలతో సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. కానీ దర్శకుడు రవికుమార్ మాత్రం వేరే సినిమాలకు కమిట్ అవ్వకుండా అయాలాన్ రిలీజ్ తర్వాతే తన తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు ఎలాంటి రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదు. అటు శివకార్తికేయన్, ఏలియన్ పాత్రకు డబ్బింగ్ చెప్పిన సిద్ధార్థ్ సైతం ఎలాంటి పారితోషికం తీసుకోలేదు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ మూవీ.. ఇప్పుడు థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది.
సంక్రాంతి బరిలో ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ తోపాటు అయలాన్ చిత్రం కూడా విడుదలైంది. మొదటి మూడు రోజుల్లో అయలాన్ కలెక్షన్స్ కొంచం తక్కువగా వచ్చినప్పటికీ.. ఆ తర్వాత మాత్రం అనుహ్యంగా కలెక్షన్స్ పెరిగాయి. ప్రస్తుతం ఈ మూవీ భారీ వసూళ్లు రాబడుతూ.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఈ సినిమా. ఈ వారం రోజుల్లో కలెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నాయి కోలీవుడ్ ట్రేడ్ వర్గాలు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, శరద్ కేల్కర్ కీలకపాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ సినిమా తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో జనవరి 26న విడుదల చేయాలని నిర్ణయించారు మేకర్స్. అంటే రిపబ్లిక్ డే సందర్భంగా ఈ చిత్రం అడియన్స్ ముందుకు రానుంది.
ఈ సినిమాను గంగ ఎంటర్టైన్మెంట్స్ తెలుగులో విడుదల చేస్తోంది. తమిళంలో సూపర్ హిట్ అయిన వరుణ్ డాక్టర్ సినిమా తర్వాత కేజేఆర్ స్టూడియోస్, గంగ ఎంటర్టైన్మెంట్స్ కలయికలో వస్తున్న సినిమా ఇది. నిజానికి ఈ మూవీ సంక్రాంతి కానుకగా తెలుగులో విడుదల కావాల్సింది. కానీ అప్పటికే టాలీవుడ్ లో నాలుగు సినిమాలు రిలీజ్ కాబోతుండడంతో… అయలాన్ చిత్రాన్ని కేవలం తమిళంలోనే రిలీజ్ చేశారు. ఇక ఎట్టకేలకు ఇప్పుడు తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది ఈ సూపర్ హిట్ మూవీ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.