
ఇటీవల హీరోయిన్స్ ఓవర్ నైట్ లో స్టార్ డమ్ తెచ్చుకుంటున్నారు. ఒకే ఒక్క సినిమా హిట్ అయితే చాలు వరుసగా అవకాశాలు క్యూ కడతాయి. ఇక టాలీవుడ్ పేరు ఇప్పుడు ప్రపంచమంతా మారుమోగిపోతుంది. దాంతో బాలీవుడ్ బ్యూటీలు కూడా టాలీవుడ్ లో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ టాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నారు. అలా వచ్చిన బ్యూటీస్ లో మృణాల్ ఠాకూర్ ఒకరు. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మృణాల్ అందం అభినయం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. తెలుగింటి అమ్మాయిలా కనిపించి అలరించింది మృణాల్.
బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ రాణిస్తున్న సమయంలో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ అందుకోవడంతో ఈ అమ్మడికి ఇక్కడ వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న సినిమాలోనూ ఈ అమ్మడు హీరోయిన్ గా నటిస్తుంది. స్టార్ డమ్ వచ్చిన తర్వాత వరుసగా సినిమాలు చేయకుండా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ దూసుకుపోతోంది.
ఈ క్రమంలోనే ఇప్పుడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించే ఛాన్స్ అందుకుందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ సర్కారు వారి పాట డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్ నటించనుందని తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి అనే సినిమా చేస్తున్నాడు.