
ఖరీదైన సెలూన్లకు వెళ్తుందా లేక విదేశీ సీరమ్స్ వాడుతుందా అని అందరూ అనుకుంటుంటారు. కానీ ఆ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన హెయిర్ కేర్ సీక్రెట్ బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. మనం ఇంట్లో వాడే అతి సాధారణమైన నూనెలే తన జుట్టుకు రక్షక కవచాలని ఆమె చెబుతోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు.. శ్రుతీ హాసన్. ఆమె పాటిస్తున్న ఆ సింపుల్ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం..
సాధారణంగా నూనె రాసుకుంటే జుట్టు జిడ్డుగా ఉంటుందని చాలామంది యువతులు దూరంగా పెడుతుంటారు. కానీ శ్రుతీ హాసన్ మాత్రం నూనె రాసుకోవడాన్నే తన ప్రధాన హెయిర్ కేర్ సీక్రెట్‌గా చెబుతోంది. “సినిమా షూటింగ్స్ సమయంలో రకరకాల హెయిర్ ప్రాసెస్ చేయడం వల్ల జుట్టు చాలా దెబ్బతింటుంది. విపరీతంగా జుట్టు ఊడిపోతుంది. అటువంటప్పుడు నూనె మాత్రమే నా జుట్టును కాపాడుతోంది” అని ఆమె వెల్లడించింది.
శ్రుతీ హాసన్ కేవలం ఒకే రకమైన నూనె కాకుండా మూడు రకాల నూనెలను కలిపి వాడుతుందట. ఆమె చెప్పిన దాని ప్రకారం ఆ మిశ్రమంలో నువ్వుల నూనె, కొబ్బరి నూనె, బాదం నూనె ఉంటాయి.
హీరోయిన్లకు ప్రతిరోజూ జుట్టుకు హీటింగ్ మిషన్లు వాడటం, రకరకాల స్ప్రేలు కొట్టడం తప్పనిసరి. దీనివల్ల జుట్టు తన సహజత్వాన్ని కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. శ్రుతీ హాసన్ కూడా ఇదే సమస్యను ఎదుర్కొన్నట్లు చెప్పింది. జుట్టు ఎక్కువగా రాలిపోతున్నప్పుడు ఆమె మళ్ళీ మన సంప్రదాయ పద్ధతి అయిన నూనె పట్టించడాన్నే నమ్ముకుంది. వారానికి కనీసం రెండు మూడు సార్లు నూనెతో తలకు మసాజ్ చేసుకోవడం వల్ల స్కాల్ప్ ఆరోగ్యంగా ఉంటుందని ఆమె సూచిస్తోంది.
Shruthi Haasan
ఖరీదైన ట్రీట్‌మెంట్లు తీసుకోలేక జుట్టు సమస్యలతో బాధపడేవారికి శ్రుతీ హాసన్ చెప్పిన ఈ చిట్కా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మన ఇంట్లో దొరికే నువ్వుల నూనె, కొబ్బరి నూనె జుట్టుకు అద్భుతమైన పోషణను ఇస్తాయి. నూనె రాసుకోవడం వల్ల జుట్టుకు తేమ అందుతుంది, చిక్కులు పడకుండా ఉంటుంది. నేటి తరం యువత కూడా కెమికల్ షాంపూలు, కండీషనర్ల కంటే ఇలాంటి సహజమైన పద్ధతులపై దృష్టి పెట్టాలని శ్రుతీ హాసన్ మాటలు గుర్తు చేస్తున్నాయి. అందంగా కనిపించడం కోసం వాడే కృత్రిమ పద్ధతుల కంటే, సహజమైన నూనెలతో జుట్టును సంరక్షించుకోవడం ఉత్తమమని శ్రుతీ హాసన్ నిరూపించింది.