Kaikala Satyanarayana: చివరి చిత్రంలోనూ యమధర్మరాజుగా నటించిన కైకాల.. జనవరిలో విడుదలకు సిద్ధం..

|

Dec 23, 2022 | 3:19 PM

1959లో సిపాయి కూతురు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన.. చివరిసారిగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో కనిపించారు. ఇదే చిత్రం కైకాల చివరి చిత్రం అని అందరూ భావించారు. కానీ ఆయన మరో సినిమాలోనూ నటించారు.

Kaikala Satyanarayana: చివరి చిత్రంలోనూ యమధర్మరాజుగా నటించిన కైకాల.. జనవరిలో విడుదలకు సిద్ధం..
Kaikala Sathyanarayana
Follow us on

నవరస నటనా సార్వభౌమ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున అనారోగ్య సమస్యలతో ఆయన తుదిశ్వాస విడిచారు. తెలుగు తెరపై ఎన్నో చిత్రాల్లో నటించారు. 60 సంవత్సరాల సినీ జీవితంలో ఆయన దాదాపు 700కు పైగా సినిమాల్లో అనేక పాత్రలు పోషించారు. చిత్రపరిశ్రమలో ఎస్వీ రంగరావు తర్వాత వైవిధ్యభరితమైన పాత్రలు పోషించినవారిలో కైకాల ఒకరు. ఆయన పేరు చెప్పగానే ఠక్కున గుర్తొచ్చే పాత్ర యమధర్మ రాజు. యమగోల, యముడికి మొగుడు, యమగోల మళ్లీ మొదలైంది, యమలీల వంటి సినిమాల్లో యముడిగా నటించి ప్రేక్షకుల మనసులలో చెరగని స్థానం సంపాదించుకున్నారు. 1959లో సిపాయి కూతురు సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన.. చివరిసారిగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో కనిపించారు. ఇదే చిత్రం కైకాల చివరి చిత్రం అని అందరూ భావించారు. కానీ ఆయన మరో సినిమాలోనూ నటించారు. అంతేకాదు.. అందులోనూ యముడిగానే కనిపించారు. ఆ సినిమా పేరే ధీర్ఘాయుష్మాన్ భవ.

ఈ సినిమాను టారస్ సినీ కార్ప్, త్రిపుర క్రియేషన్స్ బ్యానర్స్ పై బొగ్గరం వెంకట శ్రీనివాస్, వంకాయలపాటి మురళీకృష్ణ నిర్మించారు. ఈ చిత్రానికి పూర్ణానంద్ దర్శకత్వం వహించారు. ఇందులో కార్తీక్ రాజు, మిస్తి చక్రవర్తి ప్రధాన పాత్రలలో నటించారు. అయితే ఈ సినిమాను జనవరి విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ అంతలోనే కైకాల సత్యనారాయణ తుదిశ్వాస విడిచారు. కైకాల మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అని అన్నారు దీర్ఘాయుష్మాన్ భవ మేకర్స్. ఈ సందర్భంగా చిత్రనిర్మాతలు మాట్లాడుతూ.. ” నవరస భరితమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన గొప్ప నటుడు కైకాల సత్యనారాయణ. చారిత్రాత్మక, సాంఘిక చలన చిత్రాల్లో తనదైన శైలితో మెప్పించిన నవరస నటనా సార్వభౌమడు. మేము నిర్మిస్తున్న ఆయన ఆఖరి చిత్రం దీర్ఘాయుష్మాన్ భవ చిత్రంలో ఆయన యమడి పాత్ర పోషించారు.

ఈరోజు కైకాల గారు మన మధ్య లేకపోవడం చాలా బాధకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు మా ప్రగాఢ సానుభూమి తెలియజేస్తున్నాం. ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఆయన చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేసి జనవరిలో విడుదల చేయాలని అనుకుంటుండగా. ఆయన మరణవార్త మమ్మల్ని కలచివేసింది. ఈ చిత్రాన్ని ఆయనకు అంకితం చేస్తున్నాం. ” అంటూ చెప్పుకొచ్చారు.