Samantha: ఆ నమ్మకమే ఈ స్థాయికి చేర్చింది.. ప్రధాని మోదీ హాజరైన వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా సామ్!

ఒకప్పుడు కేవలం కలలకే పరిమితమైన వేదిక.. నేడు ఆమె కళ్ల ముందు సాక్షాత్కరించింది. ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ లేదు, అండగా నిలబడే వారు లేరు, కనీసం ‘నువ్వు సాధిస్తావు’ అని వెన్నుతట్టి చెప్పే గొంతు కూడా వినిపించని రోజులు అవి. అయినా వెనకడుగు వేయిలేదు. భయపడలేదు.

Samantha: ఆ నమ్మకమే ఈ స్థాయికి చేర్చింది.. ప్రధాని మోదీ హాజరైన వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా సామ్!
Samantha At Rb

Updated on: Jan 27, 2026 | 9:18 PM

కానీ నేడు అదే నటి భారతదేశ అత్యున్నత భవనంలో గౌరవ అతిథిగా అడుగుపెట్టింది. దేశ ప్రధాని, రాష్ట్రపతి వంటి దిగ్గజాలు ఉన్న వేదికపై ఆమె పేరు మారుమోగింది. తన గతాన్ని తలచుకుంటూ ఆమె చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట కన్నీళ్లు పెట్టిస్తోంది. కేవలం నటిగానే కాదు, వ్యక్తిగా కూడా ఆమె ఎందరికో స్ఫూర్తి. ఇటీవల రెండో వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఈ స్టార్ బ్యూటీ, ఇప్పుడు ఢిల్లీ వేదికగా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యారు. ఇంతకీ ఆ వేడుకలో ఆమె ఏం చెప్పింది? ఆమె ధరించిన ఆ గ్రీన్ శారీ వెనుక ఉన్న విశేషాలేంటో తెలుసుకుందాం..

రాష్ట్రపతి భవన్‌లో ..

భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన ‘అట్‌హోమ్’ రిసెప్షన్‌కు సమంత హాజరయ్యారు. జనవరి 26న జరిగిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖర్ వంటి ఎంతోమంది ప్రముఖులు పాల్గొన్నారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి మాత్రమే దక్కే ఈ అరుదైన అవకాశం సమంతకు లభించడం ఆమె అభిమానులకు గర్వకారణంగా మారింది.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సమంత సోషల్ మీడియాలో షేర్ చేసిన మాటలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. “చిన్నప్పటి నుంచి నాకు ప్రోత్సహించే వాళ్లు లేరు. ఒకరోజు నేను ఇలాంటి స్థాయికి చేరుకుంటానని చెప్పే అంతర్గత స్వరం కూడా అప్పట్లో లేదు. ఇలాంటి కలలు ఒకప్పుడు చాలా పెద్దవిగా అనిపించాయి. అయినా నేను ఆగకుండా ముందుకు సాగాను. ఈ దేశం నాకు అవకాశం ఇచ్చింది, అందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని” అంటూ ఆమె రాసిన మాటలు ఆమె పడిన కష్టాన్ని ప్రతిబింబించాయి.

గ్రీన్ శారీలో దేవకన్యలా..

ఈ వేడుకలో సమంత లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాస్టెల్ గ్రీన్ కలర్ చీరలో ఆమె ఎంతో హుందాగా కనిపించారు. ఈ చీరకు సరిపోయేలా గ్రీన్ మరియు వైట్ స్టోన్స్‌తో చేసిన భారీ చోకర్ ధరించి తన అందాన్ని మరింత పెంచుకున్నారు. మినిమల్ మేకప్, సింపుల్ హెయిర్ స్టైల్ తో ఆమె లుక్ పర్ఫెక్ట్ గా కుదిరింది. ఆ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ ‘క్వీన్ ఈజ్ బ్యాక్’ అంటూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. సమంత తాజాగా తన కెరీర్ మరియు వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరును ఆమె వివాహం చేసుకున్నారు. కోయంబత్తూరులోని ఇషా యోగా కేంద్రంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక ఘనంగా జరిగింది.

నిర్మాతగా బాధ్యతలు..

కేవలం నటనకే పరిమితం కాకుండా సమంత ఇప్పుడు నిర్మాతగా కూడా బిజీ అయ్యారు. తన సొంత బ్యానర్ ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’పై ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆమె మిత్రురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. భర్త రాజ్ నిడిమోరు ఈ ప్రాజెక్ట్‌కు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుండటం విశేషం. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సమంత తన పోరాట పటిమతో ముందుకు సాగుతున్న తీరు నిజంగా అభినందనీయం. సమంత ప్రయాణం మనకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది.. ప్రోత్సహించే వారు లేకపోయినా, మన మీద మనకు నమ్మకం ఉంటే రాష్ట్రపతి భవన్ వరకు ప్రయాణించవచ్చు.