
సినీ పరిశ్రమ బయటకు ఎంత రంగుల ప్రపంచంగా కనిపిస్తుందో, లోపల అంతే చీకటి, ద్రోహం దాగి ఉంటుంది. కొందరు నటీనటులు ఈ చేదు అనుభవాలను బహిరంగంగా పంచుకోగా, మరికొందరు తమలో దాచుకుంటారు. అయితే, బాలీవుడ్ నటి రిచా చద్దా మాత్రం తాజాగా తన జీవితంలో ఎదురైన ఒక బాధాకరమైన విషయాన్ని పంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. వ్యక్తిగత జీవితంలో బిడ్డకు జన్మనిచ్చి దాదాపు రెండేళ్ల విరామం తర్వాత సెట్స్‌పై అడుగుపెట్టిన ఆమె, ఈ సుదీర్ఘ గ్యాప్‌కు కారణమైన బాధాకరమైన అనుభవాలను పంచుకుంది.
దాదాపు రెండేళ్ల తర్వాత తాను మళ్లీ పనిలో నిమగ్నమయ్యానని రిచా చద్దా వెల్లడించింది. వీలైనంత త్వరగా సెట్‌లో అడుగుపెట్టాలనుకున్నా, తన శరీరం మనసు అందుకు సిద్ధపడటానికి చాలా సమయమే తీసుకుంది అని ఆమె వివరించింది. ఈ విషయాలను పక్కనపెడితే.. ఇండస్ట్రీలో అత్యంత దగ్గరి వ్యక్తులే తనకు ద్రోహం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ రంగంలో కొందరికి మాత్రమే నీతి నిజాయితీ వంటి విలువలు ఉంటాయని తాను అర్థం చేసుకున్నట్లు పేర్కొంది.
ఆ వ్యక్తులు ఆత్మనూన్యతా భావం ఎక్కువగా ఉన్నవారు అని రిచా వ్యాఖ్యానించింది. ‘వారు ఎప్పుడూ సంతోషంగా ఉండరు, పక్కపవాళ్లనూ సంతోషంగా ఉండనివ్వరు. పక్కవాళ్ల జీవితంలోని ఆనందాన్నంతా పీల్చేస్తుంటారు’ అంటూ వాపోయింది. ఈ ద్రోహం కొత్తేమీ కాదని, ప్రముఖ దర్శకుడు గురుదత్ 70 ఏళ్ల క్రితమే ఈ విషయం చెప్పాడు అని గుర్తు చేసింది. “అలాంటి వాళ్లను నేను క్షమిస్తానేమో కానీ, జరిగినదాన్ని మాత్రం మర్చిపోను” అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
Richa Chadda
తల్లి అయిన తర్వాత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి కూడా రిచా మాట్లాడింది. పాప పుట్టకముందు తానెలా ఉండేదాన్నో తనకే గుర్తులేదని పేర్కొంది. చాలా మంది ఏదో ఒక కంటెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండమని చెప్తున్నారు. అయితే తనకంటూ ఒక జీవితం ఉందని, ఆ లైఫ్‌లో జరిగే ప్రతిదీ చెప్పడం ఇష్టం లేదని ఆమె వివరించింది.
సోషల్ మీడియాలో ప్రతిదీ షేర్ చేయాల్సిన అవసరం ఏంటి? దానివల్ల ఎవరికైనా ఒంటరితనం పోతుందా? లేదా మనమేదో రిచ్ అని చెప్పడానికా? అని ప్రశ్నిస్తూ, “అయినా నేను ఆల్‌రెడీ రిచే (Richa)” అని సరదాగా ముగించింది. రిచా చద్దా చివరిసారిగా ‘హీరామండి’ వెబ్ సిరీస్‌లో కనిపించింది. ద్రోహాన్ని ఎదుర్కొని, మాతృత్వ విరామం తర్వాత మళ్లీ సెట్స్‌కు తిరిగి వచ్చిన రిచా చద్దా ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.