నాగ్‌పూర్, డిసెంబర్ 23: రీల్ సీన్ రియల్‌లోకి వస్తే.. ఎట్టాగుంటుందో ఓ థియేటర్‌లో ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లు చూపించారు పోలీసులు. ఓ మల్టీప్లెక్సు థియేటరులో ‘పుష్ప-2’ సినిమా ప్రదర్శన జరుగుతుంది. ప్రేక్షకులంతా మైమరచిపోయి సినిమాను ఆస్వాధిస్తున్నారు. అయితే ఇంతలో అనుకోని అతిథుల్లా సినిమా హాల్లోకి పోలీసులు బిలా బిలా ఎంట్రీ ఇచ్చారు. దీంతో అవాక్కైన ప్రేక్షకులు గుడ్లప్పగించి చూస్తుండగా.. ప్రేక్షకుల్లో ఒకడిని పట్టుకుని బయటకు ఈడ్చుకుపోయారు. అరెస్టైన వ్యక్తి పలు హత్య కేసుల నిందితుడు, డ్రగ్స్ స్మగ్లర్. దీంతో ప్రేక్షకులు సినిమాలో మరో సినిమాలాంటి ఘటన కళ్లముందు జరగడంతో అవాక్కై చూస్తూ ఉండిపోయారు. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని గురువారం అర్ధరాత్రి ఓ మల్టీప్లెక్సు థియేటరులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
విశాల్ మేశ్రామ్.. ఓ కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్. ఇతగాడు గురువారం అర్ధరాత్రి సమయంలో నాగ్‌పూర్‌లోని ఓ మల్టీప్లెక్స్ థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసిపోయి బ్లాక్‌బాస్టర్ మువీ పుష్ప 2 చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. పలు హత్యా కేసులు, డ్రగ్స్ కేసుల్లో నిందితుడిగా ఉన్న విశాల్ మేశ్రామ్ గత పది నెలలుగా పోలీసులకు దొరక్కుండా ముప్పుతిప్పలు పెడుతున్నాడు. అయితే ఇతగాడు ఇటీవల విడుదలైన పుష్ప 2 మువీని థియేటర్‌లో చూస్తున్నట్లు సమాచారం అందడంతో అతడిని ట్రాక్ చేసినట్లు పచ్‌పోలీ పోలీస్ స్టేషన్‌కు చెందిన అధికారి ఆదివారం మీడియాకు తెలిపారు. ఇతడిపై రెండు మర్డర్ కేసులు, డ్రగ్స్ అక్రమ రవాణాతో సహా మొత్తం 27 కేసులు ఉన్నాయని, గతంలో పోలీసులపై కూడా పలుమార్లు దాడి చేసినట్లు తెలిపారు.
సైబర్ నిఘాను ఉపయోగించి కొత్త స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (SUV)లో అతని కదలికలను ట్రాక్ చేస్తున్నామని.. గురువారం అతని ట్రాక్ చేయగా సినిమా హాల్ వెలుపల గ్యాంగ్‌స్టర్ వాహనం ఉన్నట్లు గుర్తించారు. ఇక పుష్ప 2 సినిమా క్లైమాక్స్ సమయంలో పోలీసు సిబ్బంది థియేటర్‌లోకి ఎంట్రీ ఇచ్చినా.. అప్పటికే మేష్రామ్ సినిమాలో ఫుల్లుగా మునిగిపోయి ఉన్నాడు. ఇంతలో అతడిని చుట్టుముట్టిన పోలీసులు.. దగ్గరకు వచ్చి తట్టేవరకు అతగాడు ఈ లోకంలోకి రాలేదు. వెంటనే అతడు ప్రతిగటించే అవకాశం ఇవ్వకుండా అరెస్ట్ చేశారు. అనంతరం నాగ్‌పూర్ సెంట్రల్ జైలుకి తరలించారు. మెష్రామ్‌ని త్వరలో నాసిక్‌లోని జైలుకు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ తరువాత సినిమా కొనసాగింపునకు పోలీసులు అనుమతివ్వడంతో ప్రేక్షకులు తలమునకలయ్యే ఆశ్చర్యంలో మునిగిపోయారు.
కాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మువీ ‘పుష్ప 2: ది రూల్’.. 2021లో వచ్చని తెలుగు మువీ ‘పుష్ప: ది రైజ్’ కి సీక్వెల్‌గా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 5న ఈ మువీ హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ, మలయాళ భాషల్లో డబ్బింగ్ వెర్షన్లతో దేశ వ్యా్ప్తంగా విడుదలైంది.