Ranga Ranga Vaibhavanga Review: ‘రంగరంగ వైభవంగా’ రివ్యూ.. రొటీన్ ఫ్యామిలీ డ్రామా..

| Edited By: Rajitha Chanti

Sep 02, 2022 | 12:27 PM

రంగరంగ వైభవంగా.. ఉప్పెన సినిమాతో గతేడాది సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్.. ఆ వెంటనే కొండపొలంతో

Ranga Ranga Vaibhavanga Review: రంగరంగ వైభవంగా రివ్యూ.. రొటీన్ ఫ్యామిలీ డ్రామా..
Ranga Ranga Vaibhavanga
Follow us on

మూవీ రివ్యూ: రంగరంగ వైభవంగా

నటీనటులు: వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ, ప్రభు, నరేష్, అలీ, నవీన్ చంద్ర తదితరులు

సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు

సినిమాటోగ్రాఫర్: శ్యామ్‌దత్ సైనూద్ధీన్

దర్శకుడు: గిరీశయ్య

నిర్మాతలు: బివిఎస్ఎన్ ప్రసాద్

రిలీజ్ డేట్: 02/09/22

రంగరంగ వైభవంగా.. ఉప్పెన సినిమాతో గతేడాది సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్.. ఆ వెంటనే కొండపొలంతో నిరాశ పరిచారు. తాజాగా ఈయన రంగరంగ వైభవంగా అంటూ వచ్చారు. మరి ఈ సినిమాతో వైష్ణవ్ ఆకట్టుకున్నారా లేదా అనేది రివ్యూలో చూద్దాం..

కథ:

రాముడు (ప్రభు), చంటి (నరేష్) మంచి స్నేహితులు. వాళ్ళ పిల్లలు రిషి (వైష్ణవ్ తేజ్), రాధ (కేతిక శర్మ) ఇద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఒకేరోజు పుడతారు.. ఒక చిన్న గొడవ వల్ల ఇగోతో మాట్లాడుకోవడం మానేస్తారు కానీ.. ఒకరంటే ఒకరికి చచ్చేంత ప్రేమ. కానీ ఒక గొడవ కారణంగా రెండు కుటుంబాలు విడిపోతాయి. విడిపోయిన రెండు కుటుంబాలను రిషి, రాధా ఎలా కలిపారు అనేది మిగిలిన కథ.

కథనం:

ఈ సినిమా కథ మొదలవడమే నిన్నే పెళ్ళాడతాతో మొదలవుతుంది. అంటే దర్శకుడు అప్పుడే చెప్పాడు తను తీసే సినిమా అలాగే ఉండబోతుంది అని. అనుకున్నట్టుగానే నిన్నే పెళ్ళాడతా నుంచి మొదలుపెట్టి ఆనందం, నువ్వు లేక నేను లేను ఇలాంటి ఎన్నో సినిమాలను కలిపి చూపించాడు దర్శకుడు గిరీషయ్యా. ప్రతి సన్నివేశం ఏదో ఒక సినిమాలో చూసినట్టే ఉంటుంది. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ అయితే ఎమోషనల్ గా నడిపించే ప్రయత్నం చేశాడు కానీ ప్రోటీన్ స్క్రీన్ ప్లే ఈ సినిమాకు మైనస్ గా మారింది. రెండు కుటుంబాలు.. 50 ఏళ్ల స్నేహం.. అనుకోకుండా వాళ్ల మధ్య గొడవలు రావడం.. వాళ్ళ పిల్లలు దాన్ని పరిష్కరించడం లాంటి కథతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయినా కూడా వినోదాత్మకంగా నడిపించాడు దర్శకుడు. కానీ ఫస్టాఫ్ వరకు అది వర్కవుట్ అయింది.. సెకండాఫ్ మాత్రం గాడి తప్పింది. ఆకట్టుకునే సన్నివేశాలు రాయడంలో దర్శకుడు విఫలమయ్యాడు. పైగా ఎమోషనల్ సీన్స్ అన్నీ.. ఇతర సినిమాలను గుర్తు చేస్తాయి.

నటీనటులు:

వైష్ణవ్ తేజ్ నటన బాగుంది. ఉప్పెనతో పోలిస్తే ఇందులో మరింత మెచ్యూర్డ్‌గా కనిపించారు వైష్ణవ్. ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే చేసారు. అయితే డాన్స్ విషయంలో మెగా హీరో ఇంకా చాలా మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. పైగా పవన్ కళ్యాణ్‌ను ఇమిటేట్ చేసారు. కేతిక శర్మ కారెక్టర్ ఉన్నంత వరకు ఓకే. ఇదివరకు గ్లామర్ డాల్‌గా కనిపించిన కేతిక.. ఇందులో మాత్రం బాగుంది.. చూడ్డానికి అందంగా కనిపించారు. నరేష్, ప్రభు కారెక్టర్స్ బాగున్నాయి. హీరో ఫ్రెండ పాత్రలో చేసిన నటుడు కామెడీ బాగా చేసారు. అలీ, నవీన్ చంద్ర పాత్రలు పరిధి మేర ఉన్నాయి. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నికల్ టీం:

రంగరంగ వైభవంగా సినిమాకు సంగీతం బలం. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సిరిసిరి మువ్వల్లేతో పాటు తెలుసా తెలుసా, కొత్తగా లేదేంటి పాటలు బాగున్నాయి. విజువల్‌గానూ చాలా బాగా చిత్రీకరించారు దర్శకుడు గిరీశయ్య. సినిమాటోగ్రఫీ నెక్ట్స్ లెవల్‌లో ఉంది. శ్యామ్‌దన్ సైనూద్దీన్ మరోసారి ఆకట్టుకున్నారు. ఎడిటింగ్ పర్లేదు. ఈ విషయంలో కోటగిరి వెంకటేశ్వరరావు వర్క్ బాగానే ఉంది. చివరగా దర్శకుడు గిరీశయ్యా గురించి చెప్పాలి. ఎప్పట్నుంచో తెలుగు సినిమాల్లో చూస్తున్న కథనే మరోసారి రాసుకున్నారు ఈయన. ముఖ్యంగా నువ్వు లేక నేను లేను, ఆనందం లాంటి సినిమాల మార్క్ ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ వరకు ఎంటర్‌టైనింగ్‌గా ఉండేలా స్క్రీన్ ప్లే రాసుకోవడం రంగరంగ వైభవంగాకు ప్లస్ అయింది. కానీ కీలకమైన సెకండాఫ్ మాత్రం పూర్తిగా వదిలేశాడు దర్శకుడు. నిన్నే పెళ్ళాడతా నుంచి చాలా సినిమాలు ఇందులో కనిపించాయి. రొటీన్ కథ మాత్రమే రంగరంగ వైభవంగా సినిమాకు మైనస్‌గా మారింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి.

పంచ్ లైన్:

రంగరంగ వైభవంగా.. అంత వైభోగం ఏం లేదు..