Rajinikanth And Akshay Kumar: సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) అలాగే బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్ (Akshay Kumar) మళ్లీ వార్తల్లో నిలిచారు. అయితే ఈ చర్చ వారి సినిమాలతో కాదు. వారి ఆస్తుల విషయంలో. తమిళనాడులో అత్యధికంగా ఆదాయపు పన్ను చెల్లించే నటుడిగా రజనీకాంత్‌ను ఆ రాష్ట్ర ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు ఘనంగా సత్కరించారు. అదే సమయంలో బాలీవుడ్ లో అత్యధిక పన్ను చెల్లించే నటుడిగా అక్షయ్‌కుమార్‌గా నిలిచారు. ఇన్‌కమ్ ట్యాక్స్ దినోత్సవం సందర్భంగా ఆదాయపు పన్ను శాఖ ఈ సీనియర్ నటులిద్దరినీ సత్కరించింది. దీంతో వీరి నికర ఆస్తుల వ్యవహారంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
రూ.350 కోట్లకు పైగానే..
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అభిమానులు ఆయనను దేవుడిలా కొలుస్తారు. సినిమాల్లో స్టైలిష్‌గా కనిపించే రజనీ నిజ జీవితంలో ఎంతో సింపుల్‌గా ఉంటారు. అయితే ఎప్పుడూ తన గురించి గొప్పలు చెప్పుకోని తలైవాకు కోట్ల సంపద ఉంది. అలాగే ఆయనకు విలాసవంతమైన ఇళ్లు, ఖరీదైన కార్లు ఉన్నాయి. సెలబ్రిటీ నెట్‌వర్త్‌పై మీడియా కథనం ప్రకారం, రజనీకాంత్ నికర ఆస్తుల విలువ దాదాపు రూ.365 కోట్లని తెలుస్తోంది. ఆయన ఒక సినిమాకు దాదాపు రూ.55 కోట్ల పారితోషకం తీసుకుంటారట. ఇక స్థిరాస్తుల విషయానికొస్తే.. చెన్నైలోని పోయెష్ గార్డెన్‌లో రజనీకి ఒక విలాసవంతమైన ఇల్లు ఉంది. దీని ఖరీదు దాదాపు 35 కోట్లు. ఇక ఆయన గ్యారేజ్లో లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. రూ.22 కోట్ల కస్టమైజ్డ్ లిమోసిన్‌తో పాటు దాదాపు రూ.17 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కార్లు ఈ సూపర్‌స్టార్ గ్యారేజ్‌లో ఉన్నాయట. అలాగే రజనీ పేరు మీద ‘రాఘవేంద్ర మండపం’ అనే కల్యాణ మండపం ఉంది. నివేదికల ప్రకారం దీని ధర రూ.20 కోట్ల వరకు ఉందట. అయితే కోట్లు విలువజేసే ఆస్తులున్నా ఆయన బాధ్యతగా సకాలంలో ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారు. ఈక్రమంలోనే ఆదాయపు పన్ను శాఖ రజనీని ఘనంగా సన్మానించింది.
కెనడాలోనూ ఆస్తులు..
ఇక బాలీవుడ్‌లో అత్యధికంగా పన్ను చెల్లించే నటుడిగా కూడా అక్షయ్ కుమార్ నిలిచాడు. మీడియా నివేదికల ప్రకారం మొత్తం అక్షయ్ కుమార్ నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 369 కోట్లని తెలుస్తోంది. ఆయన ఒక్కో సినిమా కోసం రూ.100 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటారట. ఆయనకు సినిమాలతో పాటు ఇతర ఆదాయ వనరులు కూడా ఉన్నాయి. ఈ నటుడికి ఇండియాతో పాటు కెనడాలోనూ విలాసవంతమైన భవనాలు, కార్లు ఉన్నాయి. ఒక ప్రైవేట్ జెట్ కూడా ఈ ఖిలాడీ దగ్గర ఉంది. దీని విలువ దాదాపు రూ. 260 కోట్లు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..