
పెళ్లయిన అమ్మాయిలందరూ మెడలో మంగళసూత్రం వేసుకుంటారు. కాలికి మెట్టెలు ధరిస్తారు. అలాగే నుదుటిన బొట్టు పెట్టుకుంటారు. ఇవి కచ్చితంగా ఆచరించాలన్న రూల్ లేదు. కానీ ఇవి అనాదిగా వస్తున్న సంప్రదాయాలు, ఆచారాలు. భారతీయ మహిళలందరూ వీటిని తూచా తప్పకుండా పాటిస్తారు. అయితే ఒక టాలీవుడ్ హీరో కమ్ డైరెక్టర్ ఇప్పుడు తాళి బొట్టు ధరించడంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. మెడలో మంగళసూత్రం ధరించడమనేది ఆడవారి ఇష్టానికే వదిలేయాలన్నారు. తానైతే తన భార్యకు తాళి బొట్టు వేసుకోవద్దనే చెబుతానంటూ హాట్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ నటుడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. కామెంట్స్ పై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చాలా మంది నెటిజన్లు హీరోను ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ మంగళసూత్రం గురించి మాట్లాడిన ఆ నటుడు ఎవరనుకుంటున్నారా? అందాల రాక్షసి సినిమాతో హ్యాండ్సమ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్.
చిలసౌ సినిమాతో దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్న రాహుల్ రవీంద్రన్ ఇప్పుడు మరో సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో ఆయన తెరకెక్కించిన చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి ఇందులో మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 07న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటోంది చిత్ర బృందం. రష్మికతో పాటు రాహుల్ రవీంద్రన్ కూడా వరుసగా ఇంటర్వ్యూలకు హాజరువుతున్నారు. ఈ క్రమంలో తాళి బొట్టు ధరించడంపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
‘నాకు పెళ్లి అయిన తర్వాత.. మంగళసూత్రం మెడలో వేసుకోవాలా వద్దా అనేది నీ నిర్ణయమే అని నా భార్య చిన్మయికి చెప్పాను. నేనైతే తాళి వేసుకోవద్దనే చెబుతాను. ఎందుకంటే పెళ్లి తర్వాత అమ్మాయిలకు తాళి బొట్టు ఉన్నట్లు అబ్బాయిలకు ఏం ఉండదు. నా దృష్టిలో ఇది కూడా ఓ వివక్ష లాంటిదే. మగవారికి లేని నిబంధనలు, ఆంక్షలు మహిళలకు మాత్రమే ఉండటం సరికాదు’ అని రాహుల్ రవీంద్రన్ చెప్పుకొచ్చాడు. దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. చాలా మంది రాహుల్ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.