
ఢీ ఫేమ్, ప్రముఖ డ్యాన్సర్ పండు మాస్టర్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. నాలుగు నెలల క్రితం విశాఖపట్నం జిల్లా తగరపువలసలో జరిగిన ఓ ఈవెంట్ కు హాజరై హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆనందపురం సమీపంలో కారు ఆపి రోడ్డు పక్కన నిలబడిన పండు మాస్టర్ ను వేగంగా వచ్చిన ఒక వ్యాన్ బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పండు మాస్టర్ రెండు కాళ్లు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. దీంతో వెంటనే అతనిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. ఆపై అవసరమైన ఆపరేషన్లు కూడా పూర్తి చేశారు. కాగా డ్యాన్సే జీవితంగా బతికే పండు మాస్టర్ కు సరిగ్గా కాళ్లకు తీవ్రమైన గాయాలు కావడం అభిమానులను తీవ్ర ఆవేదనకు గురి చేసింది. ప్రస్తుతం ఇంట్లోనే ఉండి క్రమ క్రమంగా కోలుకుంటోన్న పండు మాస్టర్ తన తాజా హెల్త్ కండీషన్ గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు యాక్సిడెంట్ తర్వాత తన రికవరీ జర్నీకి సంబంధించి ఒక వీడియోను యూట్యూబ్ లో షేర్ చేశాడీ డ్యాన్స్ మాస్టర్. అయితే ఇది చిన్న వీడియోనే అని, త్వరలోనే పూర్తి వీడియోను రిలీజ్ చేయనున్నట్లు పండు మాస్టర్ వెల్లడించారు.
‘రికవరీ జర్నీ.. మై ఫస్ట్ వీడియో గ్లింప్స్’ అనే పేరుతో రిలీజ్ చేసిన ఈ 1.25 నిమిషాల నిడివి వీడియోలో నెమ్మదిగా అయినా తన ఆరోగ్యం మెరుగుపడుతోందనే విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు పండు మాస్టర్. దీంతో ఫ్యాన్స్, నెటిజన్లు హర్షం వ్యక్తం చేశారు. అదే సమయంలో తాను త్వరగా రికవరీ కావాలని ప్రార్థనలు చేస్తున్న ప్రతి ఒక్కరికీ పండు మాస్టర్ కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులు చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత తనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నట్లు ఎమోషనల్ అయ్యాడు. ఇక యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఆ తర్వాత తనకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? డాక్టర్లు ఏమన్నారు? ప్రమాదం తర్వాత ఆరోగ్య పరిస్థితి, గాయాల తీవ్రత, చికిత్స, ఫిజియోథెరపీ, వైద్యుల సూచనలు, రికవరీ తదితర అంశాలపై పూర్తి వివరాలతో ఫుల్ వీడియోను త్వరలో విడుదల చేయనున్నట్లు పండు మాస్టర్ తెలిపారు. దీంతో ఆయన అభిమానులు పండు మాస్టర్ వీడియో కోసం ఎదురు చూస్తున్నారు. తన యాక్సిడెంట్ కు సంబంధించి ఏవైనా కొత్త విషయాలను పండు మాస్టర్ చెబుతాడేమోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి