
తెలుగు చిత్రసీమలో తనదైన శైలితో, ప్రత్యేకమైన వాచికంతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నటుడు నూతన్ ప్రసాద్. కామెడీ పాత్రలైనా, కన్నింగ్ విలన్ పాత్రలైనా తన అభినయంతో ప్రాణం పోసిన ఆయన అసలు పేరు తాడేపల్లి సత్యదుర్గా వరప్రసాద్. 1945 డిసెంబర్ 12న కృష్ణా జిల్లా కైకలూరులో జన్మించిన వరప్రసాద్ తండ్రి సుబ్బారావు గుమాస్తాగా, తల్లి శ్యామలాదేవి బట్టలు కుడుతూ కుటుంబాన్ని పోషించారు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, వరప్రసాద్ కైకలూరులో ఎస్.ఎస్.ఎల్.సి. వరకు చదివి, 1965లో మచిలీపట్నంలోని నేషనల్ కాలేజీలో ఐ.ఐ.టి పూర్తి చేశారు. ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్, హైదరాబాద్‌లోని హెచ్.ఎ.ఎల్. సంస్థల్లో ఉద్యోగాలు చేసిన ఆయన, రంగస్థల నటుడు భానుప్రకాష్ ద్వారా నటనపై ఆసక్తి పెంచుకున్నారు. రంగస్థలంపై పదేళ్లు కృషి చేసిన వరప్రసాద్, 1972లో విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి నాటక పోటీల్లో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకుని తన తల్లి కోరికను పాక్షికంగా నెరవేర్చారు. సినీ రచయిత పినిశెట్టి శ్రీరామమూర్తి ద్వారా సినీ రంగ ప్రవేశం చేసినా, విడుదలైన తొలి చిత్రం అందాల రాముడు. ముత్యాల ముగ్గులోని నిత్య పెళ్లికొడుకు పాత్రతో గుర్తింపు పొందారు. సినిమా రంగంలో నిలదొక్కుకోలేకపోతున్నాననే నిరాశతో మద్యపానానికి బానిసైన వరప్రసాద్, ఆరోగ్యం క్షీణించాక కళ్ళు తెరిచారు. వైద్య పరీక్షల అనంతరం ఎటువంటి జబ్బు లేదని డాక్టర్ చెప్పడంతో, మద్యం మానేసి కొత్త జీవితం ప్రారంభించారు. ఈ కొత్త అధ్యాయానికి గుర్తుగా తన పేరును నూతన్ ప్రసాద్‌గా మార్చుకున్నారు. ఈ మార్పు ఆయన సినీ కెరీర్‌కు గొప్ప మలుపునిచ్చింది.
ఊరుమ్మడి బతుకులు తర్వాత కేవలం 15 రోజుల్లో వచ్చిన చలిచీమలు చిత్రం నూతన్ ప్రసాద్‌కు 101 జిల్లాల అందగాడు అనే బిరుదును తెచ్చిపెట్టింది. పట్నం వచ్చిన పతివ్రతలు చిత్రంలో పోలీసు పాత్ర, బాలకృష్ణతో కలిసి నటించిన దేశోద్ధారకుడు చిత్రంలో ప్రధాన విలన్ పాత్ర ఆయనకు మరింత ఖ్యాతిని తెచ్చాయి. చలిచీమలు, కలియుగ మహాభారతం, పట్నం వచ్చిన పతివ్రతలు చిత్రాల్లోని ఆయన సంభాషణలు గ్రామఫోన్ రికార్డుల రూపంలో వచ్చి ఆయన పేరును చిరస్థాయిగా నిలిపాయి. ఎన్.టి.ఆర్., ఎ.ఎన్.ఆర్., కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ వంటి మూడు తరాల హీరోలతో కలిసి నటించిన నూతన్ ప్రసాద్, తన డైలాగ్ డెలివరీ, నటనలో టైమింగ్‌కు ప్రసిద్ధి చెందారు. ప్రెసిడెంట్ పేరమ్మ చిత్రంతో హీరోగా మారి, కుడి ఎడమైతే, సుబ్బలక్ష్మి సుబ్బారాయుడు వంటి చిత్రాల్లోనూ హీరోగా నటించారు. ఓ అమ్మ కథ చిత్రాన్ని స్వయంగా నిర్మించారు. 1989 ఫిబ్రవరి 1వ తేదీ నూతన్ ప్రసాద్ జీవితంలో దుర్దినం. బామ్మ మాట బంగారు బాట చిత్రం షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో కారును ఎత్తిన క్రేన్ చైన్ తెగిపోయింది. ఈ ఘటనలో నూతన్ ప్రసాద్ వెన్నుపూస విరిగి, రెండు కాళ్ళు చచ్చిపడిపోయాయి. ఈ విషాదం వ్యక్తిగతంగా ఆయనకు తీరని వేదనను మిగిల్చినా, తెలుగు చిత్ర పరిశ్రమ ఒక అద్భుత నటుడిని పాక్షికంగా కోల్పోయింది.
అయితే, ఆయన దృఢచిత్తం, ఆత్మవిశ్వాసం సన్నగిల్లలేదు. వీల్‌చైర్‌కు పరిమితమైనప్పటికీ, కర్తవ్యం సినిమాతో మళ్ళీ నటించడం ప్రారంభించారు. ప్రమాదానికి ముందు 365 చిత్రాల్లో నటిస్తే, ప్రమాదం తర్వాత కూడా 110కి పైగా సినిమాల్లో నటించడం ఆయన సంకల్పానికి నిదర్శనం. అనువాద చిత్రాలకు కూడా తన వాచికాన్ని ఉపయోగించి, ఆయనకి ఇద్దరు చిత్రంలో గుమ్మడికి, సింహాసనం చిత్రంలో అంజాద్ ఖాన్‌కు డబ్బింగ్ చెప్పారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రవీంద్రభారతి కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన నూతన్ ప్రసాద్ 2011 మార్చి 30న కన్నుమూశారు. ఆయన తనయుడు చిత్రాల్లో నటించినా తండ్రిలా గుర్తింపు పొందలేకపోయారు.
(Note: ఈ కథనం సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులతో పాటు ఇంటర్నెట్ నుంచి సేకరించాం)
Also Read: 6 ఏళ్లకే నటుడిగా ఎంట్రీ.. ఏకంగా ముగ్గురు సీఎంలతో నటించాడు.. కానీ చివరకు..