ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా తొలి పోస్టర్‌పై రగులుతున్న వివాదం.. అసలు అభ్యంతరం ఏంటి?

ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమా తొలి పోస్టర్ విడుదలైన తర్వాత తమిళనాడులో వివాదం చెలరేగింది. నిర్మాత నాగవంశీ చేసిన పోస్టులోని "ఉత్తరాదిలో జన్మించాడు" అనే వ్యాఖ్యపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మురుగన్‌ను తమిళుల ఆరాధ్య దైవంగా భావించే నేపథ్యంలో ఈ వ్యాఖ్య రాజకీయ, సామాజిక చర్చకు దారి తీసింది.

ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా తొలి పోస్టర్‌పై రగులుతున్న వివాదం.. అసలు అభ్యంతరం ఏంటి?
Ntr Trivikram Film Poster

Updated on: Jul 05, 2026 | 7:19 PM

 

ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ చిత్రం విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. తొలి పోస్టర్‌తోనే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చిత్రానికి పేరు ఇంకా ప్రకటించలేదు. అయినప్పటికీ విడుదల చేసిన పోస్టర్, నిర్మాత నాగవంశీ, హీరో ఎన్టీఆర్ చేసిన సామాజిక మాధ్యమాల పోస్టులు తమిళనాడులో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా పోస్టర్‌కు జత చేసిన సందేశంపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

వివాదానికి కారణమేంటి?

తొలి పోస్టర్‌ను విడుదల చేస్తూ నిర్మాత నాగవంశీ.. “ఉత్తరాదిలో జన్మించాడు.. భారత హృదయభాగంలో తీర్చిదిద్దబడ్డాడు.. దక్షిణాదిలో ఆరాధించబడుతున్నాడు.. ఇప్పుడు ప్రపంచమంతటికీ చెందిన గాథగా వస్తున్నాడు” అని పేర్కొన్నారు. మరోవైపు ఎన్టీఆర్.. “శివుడి కుమారుడు.. పార్వతీదేవి గర్వకారణం” అనే భావంతో పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ రెండు పోస్టుల తర్వాత సినిమా కథపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

తమిళనాడులో ఎందుకు అభ్యంతరాలు?

నాగవంశీ పోస్టులోని “ఉత్తరాదిలో జన్మించాడు” అనే పదాలపైనే ప్రధానంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తమిళ సంప్రదాయంలో మురుగన్‌ను తమిళుల ఆరాధ్య దైవంగా భావిస్తారు. అలాంటి దేవుడిని ఉత్తర భారతంతో అనుసంధానించేలా వ్యాఖ్యానించడం సరైంది కాదని కొందరు సామాజిక మాధ్యమ వినియోగదారులు, రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు. అయితే సినిమా కథ, పాత్రల గురించి చిత్రబృందం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరాలు వెల్లడించలేదు. పోస్టర్‌లోని సంకేతాలు, అందులోని పదాల ఆధారంగానే ఈ చర్చ కొనసాగుతోంది.

వివాదంలోకి సీమాన్

ఈ అంశంపై నామ్ తమిళర్ కచ్చి పార్టీ అధినేత సీమాన్ స్పందించారు. మురుగన్‌ను ఉత్తర భారతానికి చెందిన దేవుడిగా చూపించే ప్రయత్నాన్ని తమిళులు అంగీకరించరని హెచ్చరించారు. తమిళుల విశ్వాసాలను దెబ్బతీసేలా సినిమా ఉంటే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.

మరోవైపు భిన్న అభిప్రాయాలు

సీమాన్ వ్యాఖ్యలను ద్రవిడ దేశం పార్టీ అధ్యక్షుడు కృష్ణారావు ఖండించారు. మురుగన్ ఒక్క తమిళనాడుకే చెందిన దేవుడు కాదని, దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో ఆరాధించబడుతున్నారని చెప్పారు. హిందూ సంప్రదాయంలో తమిళనాడులో మురుగన్‌గా, తెలుగు రాష్ట్రాల్లో సుబ్రహ్మణ్యస్వామిగా, ఉత్తర భారతంలో కార్తికేయుడు, స్కందుడు పేర్లతో, మరికొన్ని ప్రాంతాల్లో కుమారస్వామిగా పూజలు అందుకుంటారు. శివుడు, పార్వతీదేవి కుమారుడిగా, దేవతల సేనాధిపతిగా పురాణాల్లో ఆయన ప్రస్తావన ఉంది. స్కంద పురాణం, శివ పురాణం, మహాభారతంలోనూ కార్తికేయుడి గురించి వివరాలు ఉన్నాయి. అయితే తమిళ సంస్కృతిలో మురుగన్‌కు ఉన్న ప్రత్యేక స్థానం కారణంగా ఈ అంశం అక్కడ భావోద్వేగంగా మారింది.

పోస్టర్‌లోని సంకేతాలు ఏమి చెబుతున్నాయి?

పోస్టర్‌లో త్రిశూలం ప్రధానంగా కనిపిస్తోంది. దాని మధ్య భాగంలో జన్యుక్రమాన్ని పోలిన ఆకారం ఉండటంతో.. అది సృష్టి, జీవం, దైవత్వానికి సంకేతమా? అనే చర్చ జరుగుతోంది. త్రిశూలం కింద యుద్ధభూమిని తలపించే దృశ్యాలు, కాలిపోయిన జెండాలు, పడిపోయిన యోధులు కనిపిస్తున్నాయి. దీంతో ఇది మహాయుద్ధం నేపథ్యంలో సాగే కథ కావచ్చని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. పోస్టర్‌లో కనిపించే సంస్కృత శ్లోకం కూడా చర్చకు కారణమైంది. ఆత్మకు జన్మ, మరణం ఉండదనే భావాన్ని చెప్పే ఈ శ్లోకం భగవద్గీతలోనిది. దీంతో ధర్మం, ఆత్మ, పునర్జన్మ వంటి అంశాలు సినిమాలో ఉండొచ్చని కొందరు ఊహిస్తున్నారు. అయితే దీనిపై చిత్రబృందం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

చిత్రబృందం స్పందిస్తుందా?

ఇప్పటివరకు ఈ వివాదంపై ఎన్టీఆర్, త్రివిక్రమ్ లేదా చిత్ర నిర్మాతలు స్పందించలేదు. సినిమా కథ ఏమిటి? పోస్టర్‌లోని సంకేతాల వెనుక ఉద్దేశం ఏమిటి? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఒక పోస్టర్, దానికి జత చేసిన కొన్ని వాక్యాలు ఇప్పుడు తమిళనాడులో రాజకీయ, సామాజిక చర్చకు దారితీశాయి. చిత్రబృందం స్పందించే వరకు ఈ వివాదం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Follow Us