Cinema : ప్రపంచంలోనే ఎత్తైన ప్రాంతంలో షూటింగ్.. అడియన్స్ ముందుకు మరొక్కసారి..

ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో గురుడోంగ్మార్ సరస్సు వద్ద షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా ‘మరొక్కసారి’. ఈ చిత్రంలో న‌రేష్ అగ‌స్త్య, సంజనా సార‌థి హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా.. డైరెక్టర్ నితిన్ లింగుట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Cinema : ప్రపంచంలోనే ఎత్తైన ప్రాంతంలో షూటింగ్.. అడియన్స్ ముందుకు మరొక్కసారి..
Marokkasaari

Updated on: Jan 21, 2026 | 11:41 AM

న‌రేష్ అగ‌స్త్య, సంజనా సార‌థి హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న లేటేస్ట్ మూవీ మరొక్కసారి. ఈ చిత్రాన్ని సీకే ఫిల్మ్ మేకర్స్ బ్యానర్‌పై బి. చంద్రకాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఫీల్ గుడ్ రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్కు నితిన్ లింగుట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ద‌క్షిణాది భాష‌ల్లో ఈ సినిమాను రిలీజ్ చేయ‌టానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. రొటీన్ సినిమా మేకింగ్ స‌రిహ‌ద్దుల‌ను దాటి మరొక్క‌సారి మేక‌ర్స్ ఈ సినిమాను ఛాలెంజింగ్‌గా రూపొందించారు. రిచ్ విజువ‌ల్స్ లొకేష‌న్స్‌లో బ‌ల‌మైన ఎమోష‌న్స్‌ను స‌న్నివేశాల్లో చూపించ‌టానికి డిఫ‌రెంట్ లొకేష‌న్స్‌లో సినిమాను చిత్రీక‌రించారు. కేర‌ళ‌లోని స‌హ‌జ సిద్ధమైన ప్రకృతి అందాల న‌డుమ ఈ సినిమాను చిత్రీక‌రించారు. అలాగే టిబెట్ సరిహద్దుకు దగ్గరలోని అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో.. గురుడోంగ్మార్ సరస్సు వద్ద కూడా ఈ సినిమాను తెరకెక్కించారు.

సముద్ర మట్టానికి సుమారు 5,430 మీటర్లు (17,800 అడుగులు) ఎత్తులో ఉన్న గురుడోంగ్మార్ సరస్సు ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న సరస్సులలో ఒకటి. ఈ సరస్సు వద్ద చిత్రీకరించిన మొదటి భారతీయ సినిమాగా ‘మరొక్కసారి’ నిలిచింది. కఠినమైన పరిస్థితుల్లో, సాయుధ దళాల ప్రత్యేక అనుమతులతో ఈ అరుదైన చిత్రీకరణ జరగడం విశేషం. చాలా తక్కువ ఆక్సిజన్ స్థాయిలు, తీవ్రమైన చలి, పరిమిత షూటింగ్ సమయాల్లో అనుకోని వాతావరణ మార్పులు వంటి కఠిన పరిస్థితుల మధ్య షూటింగ్‌ను కంప్లీట్ చేసే స‌మ‌యంలో నటీనటులు, సాంకేతిక బృందం ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు.

ఈ సినిమా నిర్మాణ సమయంలో టీమ్‌కు లాజిస్టిక్ సమస్యలు ఎదురయ్యాయి. కఠినమైన భూభాగం, పరిమిత రవాణా సౌకర్యాలు, షూటింగ్‌కు కావాల్సిన ఎక్విప్‌మెంట్ తరలింపులో ఆలస్యం కావ‌టం, స్థానికంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోవ‌టానికి కావాల్సిన‌ అనుమతుల రావ‌టంలో ఏర్పడిన‌ సంక్లిష్టత, సమాచార, విద్యుత్ పరిమితులు, మారుతూ ఉండే వాతావరణ పరిస్థితులు వంటి సవాళ్లు ఎదురయ్యాయి. ఈ మొత్తం షెడ్యూల్ అంతా నటీనటులు, టెక్నిక‌ల్ టీమ్ ఆరోగ్యం, భద్రత, మానసిక ఉత్సాహానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ప్రొడక్షన్ హెడ్ అనుదీప్ పడూరు ఎంతో ప్రశంసనీయమైన పాత్ర పోషించ‌టంతో కఠినమైన వాతావరణంలోనూ షూటింగ్ సజావుగా పూర్తయ్యింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ పూర్తైంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్యక్రమాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్‌లో డీఐ వ‌ర్క్ జ‌రుగుతోంది. సినిమాకు కావాల్సిన పూర్తి విజువల్ టోన్ అందించేందుకు ఫైనల్ కలర్ గ్రేడింగ్, విజువల్ ఫినిషింగ్ పనులు జరుగుతున్నాయి.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఒకప్పుడు తోపు హీరోయిన్.. చిరంజీవితో ఎక్కువ సినిమాలు.. 3 పెళ్లిళ్లు.. ఇప్పుడు రాజకీయాల్లో బిజీ..