Kannappa Movie: ‘నాకెందుకు స్వామి ఈ పరీక్ష’.. కన్నప్ప హార్డ్ డిస్క్ దొంగతనంపై మంచు విష్ణు ఆవేదన

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు మేకర్స్. అయితే ఇంతలోనే కన్నప్ప టీమ్ కు బిగ్ షాక్ తగిలింది. సినిమాలో కీలకమైన సీన్స్ ఉన్న హార్డ్ డిస్క్ చోరీకి గురైంది.

Kannappa Movie: నాకెందుకు స్వామి ఈ పరీక్ష.. కన్నప్ప హార్డ్ డిస్క్ దొంగతనంపై మంచు విష్ణు ఆవేదన
Kannappa Movie

Updated on: May 27, 2025 | 7:40 PM

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం కన్నప్ప. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 27న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్స్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ లాంటి స్టార్స్ ఉండటంతో సగటు అభిమానులు కూడా కన్నప్ప సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇంతలోనే కన్నప్ప సినిమా సీన్స్ ఉన్న హార్డ్ డిస్క్ ని దొంగతనం చేశారని, దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారని తెలిసింది. తాజాగా ఇదే విషయంపై మంచు విష్ణు, అతని నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించింది.

‘కన్నప్పలోని రెండు ప్రధాన పాత్రల మధ్య కీలకమైన యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు, కీలకమైన వీఎఫ్ఎక్స్ వర్క్ ఉన్న హార్డ్ డ్రైవ్ రవాణా సమయంలో చోరీకి గురైంది. ఈ డ్రైవ్ ముంబైలోని హైవ్ స్టూడియోస్ నుంచి మా ఆఫీస్ కి డెలివరీ అవ్వాలి. అయితే ఆ ప్యాకేజీని చట్టవిరుద్ధంగా అడ్డగించి రఘు అనే వ్యక్తి సంతకం చేసి తీసుకున్నాడు. చరిత అనే మహిళ సూచనల మేరకు అతను అలా వ్యవహరించాడు. వారిద్దరూ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులే. వాళ్లు చేసింది దొంగతనం. పోలీసులకు ఫిర్యాదు చేసాం. దీని వెనుక ఉన్న వారు ఎవరు అనేది పోలీసులకు పూర్తి సమాచారం ఇచ్చాం. ఇది ఎవరు చేయించారో రహస్యం కాదు అందరికి తెలుసు. ఆ నేరస్థుడి ఉద్దేశ్యం క్లారిటీగా ఉంది’.

హార్డ్ డిస్క్ చోరీపై నిర్మాణ సంస్థ ప్రకటన..

‘ కన్నప్ప సినిమా విడుదలను అడ్డుకోవడానికి వారు తీవ్రంగా ప్రయత్నించారు. అది కుదరకపోవడంతో ఇలా చట్ట విరుద్ధంగా చేసారు. అలాగే విడుదల కాని 90 నిమిషాల ఫుటేజ్‌ను ఆన్‌లైన్‌లో లీక్ చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారని విశ్వసనీయ నిఘా వర్గాలు వెల్లడించాయి. దీనికి ప్రతిస్పందనగా మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఈ విషయాన్ని సైబర్ క్రైమ్ అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. పరిశ్రమలోనే ఇటువంటి చౌకబారు వ్యూహాలను అమలు చేయడం నిరాశపరిచింది. తెలుగు సినిమా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందుతున్న ఈ సమయంలో ఇంతటి స్థాయికి దిగజారడం తీవ్ర అవమానకరం. కన్నప్పను సినిమాటిక్ ల్యాండ్‌మార్క్‌గా మార్చడానికి నిబద్ధతతో పనిచేసిన మా బృందం, మా తారాగణం, ప్రతి సాంకేతిక నిపుణుడితో మేం ఐక్యంగా ఉన్నాం. ఈ పిరికి ప్రయత్నాలకు మేము భయపడం. ఎప్పటిలాగే నిజం గెలుస్తుందని మేము విశ్వసిస్తున్నాం. ఏదైనా పైరసీ కంటెంట్ బయటపడితే దానిని ఆస్వాదించవద్దని, ప్రసారం చేయవద్దని మాకు అండగా నిలబడాలని ప్రజలను, మీడియాను కోరుతున్నాం’ అని మంచు విష్ణు రిక్వెస్ట్ చేశాడు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .