Yeshanagula : . ఈ పాటలో ఇంత అర్ధం ఉందా.. ఏశనాగుల కట్ట మీద సాంగ్ లిరిక్స్‌కు అర్థం ఇదే..
ప్రస్తుతం ఎక్కడ విన్నా రెండు పాటలో దుమ్మురేపుతున్నాయి. అటు ఇరుముడి చిత్రంలోని మల్లెపూల పల్లకి సాంగ్ అయితే.. ఇటు ది ప్యారడైజ్ చిత్రం నుంచి విడుదలైన ఏశనాగుల కట్టమీద సాంగ్. ముఖ్యంగా పక్కా మాస్ ఎనర్జిటిక్ తో వచ్చిన ఏశనాగుల సాంగ్ యూట్యూబ్, సోషల్ మీడియాను ఉపేస్తుంది. అయితే ఈ పాటకు లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ అర్థం చెప్పారు.

డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రం నుంచి విడుదలైన ‘ఏషనాగుల’ అనే పాట అటు యూట్యూబ్, సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. ఈ జానపద శైలి పాటకు ప్రముఖ రచయిత కాసర్ల శ్యామ్ గీత రచన చేశారు. ఇటీవలే యూట్యూబ్‌లో రిలీజ్ అయిన ఈ పాట మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. తెలంగాణ ఫోక్ పాటకు.. అదే స్థాయిలో తెలంగాణ భాషలో అద్భుతమైన లిరిక్స్ అందించారు కాసర్ల శ్యామ్. దీంతో ఈ పాటకు అర్థాన్ని గూగుల్లో డీకోడ్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ పాట వెనుక ఉన్న కథ, లిరిక్స్ అంతరార్థాన్ని వివరించారు. “ఏశనాగుల” అనేది తెలంగాణ పల్లెల్లో తరతరాలుగా వస్తున్న ఒక కోలాటం పాట. గాయకుడు జంగిరెడ్డి ద్వారా ప్రజాదరణ పొందిన ఈ జానపద బాణీని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సినిమాలో ఒక ప్రత్యేక సన్నివేశం కోసం ఎంచుకున్నారు. ప్రొడక్షన్ పరంగా జంగిరెడ్డి గారి నుంచి సరైన అనుమతులు, హక్కులు పొందిన తర్వాతే ఈ పాటను చిత్రంలో చేర్చడం జరిగిందని చెప్పుకొచ్చారు.
ఈ పాటలో ఎలాంటి గ్లామరస్ ఫోజులు లేకుండా 80-90ల కాలంటి తెలంగాణ స్వచ్ఛమైన విరహాన్ని, రూటెడ్ రొమాంటిక్ ప్రేమని ఈ పాటలో ఆవిష్కరించినట్లు శ్యామ్ తెలిపారు. కాసర్ల శ్యామ్ ఈ పాటలో ఉపయోగించిన ప్రత్యేక తెలంగాణ పల్లె పదాలకు పూర్తి వివరణ ఇచ్చారు.
* జిమ్మేదారి పటేలో.. గల్మకాడ నీకోసం ముగ్గునైతిరో: ‘జిమ్మేదారి’ అంటే బాధ్యత తీసుకున్నవాడు. ‘గల్మ’ అంటే గడప/వాకిలి. “నా బాధ్యత తీసుకున్న ఓ నా ప్రియుడా! నీ రాక కోసం వేకువజామునే వాకిట్లో ముగ్గులా ఎదురుచూస్తున్నాను” అని నాయిక తన ఆరాటాన్ని వ్యక్తం చేస్తుంది.
* నీ తవ్వల నా చూపులు కావలున్నాయో: ‘తవ్వ’ అంటే దారి. నాయిక తన చూపులను ప్రియుడు వచ్చే దారిలో కాపలాగా (కావలి) పెట్టిందట.
*అర్రల గుడ్డి దీపమయిందిర పానం: ‘అర్ర’ అంటే గది. చీకటి గదిలో ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్న మినుకు మినుకుమనే గుడ్డి దీపంలా తన ప్రాణం ఉక్కిరిబిక్కిరి అవుతోందని నాయిక భావిస్తోంది.
* బుడపరకల కూర వండిన నీకోసం బుడిమట్ల బువ్వతోని: పల్లెటూర్లలో ఎంతో ఇష్టంగా తినే చిన్న చేపల (బుడపరకలు) కూరను, సువాసన ఇచ్చే బుడమ వడ్ల బువ్వతో సిద్ధం చేసి, ప్రేమగా వచ్చి తినిపోమని ప్రియుడిని ఆహ్వానిస్తోంది.
* నీ సెమటలు దుడుసుకున్న నా వాయిల్ సీరా సింగులే సిక్కుల బడెరా: ప్రియుడు అలసిపోయినప్పుడు తన వాయిల్ చీర కొంగుతో చెమట తుడిచిన ఆ సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకుంటూ, ఆ ఆలోచనల్లో చీర కుచ్చిళ్లు కూడా సరిగా కట్టుకోలేకపోతున్నానని వివరిస్తుంది.
* జబ్బల రైక ఉక్కులే ఉట్టుట్టిగా తెగిపోయినాయిరా: ప్రియుడి కౌగిలింత, స్పర్శ గుర్తొచ్చినప్పుడు నాయిక ఒళ్ళు పులకరించిపోతుందనే భావాన్ని ఎలాంటి అసభ్యత లేకుండా కవితాత్మకంగా చెప్పారు.
* నీ వాసన మోసిన నా వళ్ళు.. ఎన్నడో మరిసిపాయే ఎచ్చటి నీళ్ళు: ప్రియుడి పరిమళం, చెమట వాసన తన శరీరానికి అంటుకుందని, ఆ మధురమైన జ్ఞాపకాన్ని పోగొట్టుకోవడం ఇష్టం లేక వెచ్చని నీళ్లతో (ఎచ్చటి నీళ్ళు) స్నానం చేయడం కూడా మానేశానని అంటోంది.
* ఇరుకు ఇల్లు ఏరుకుంటాందిరని ఎంగిలి పూలు: ఈ చిన్న ఇరుకు ఇల్లు అంతటా నీ జ్ఞాపకాలు, నీ ఆనవాళ్లు (ఎంగిలి పూలు) నిండి ఉన్నాయని, ప్రతి మూలా నీ స్పర్శను గుర్తుచేస్తుందని నాయిక విరహంతో పాడుకుంటుంది.
ఈ విధంగా తెలంగాణ సంస్కృతి, గ్రామీణ పదబంధాలు , స్వచ్ఛమైన ప్రేమని మేళవించి కాసర్ల శ్యామ్ ఈ పాటను అద్భుతంగా తీర్చిదిద్దారు.
ఎక్కువమంది చదివినవి : Nagarjuna : ఆయన తినే రైస్ మనం తినలేము.. నాగార్జున డైట్ రివీల్ చేసిన మేకప్ ఆర్టిస్టు..
ఎక్కువమంది చదివినవి : Tollywood: కొత్తింట్లోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్.. ఫ్యామిలీతో కలిసి గృహ ప్రవేశం.. ఫోటోస్ వైరల్..
