
కల్కి 2898 ఏడీ.. రోజుకు రోజుకు మరింత హైప్ క్రియేట్ చేస్తున్న సినిమా. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ చిత్రాన్ని చూసేందుకు అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. టీజర్, ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ మూవీపై ఓ రేంజ్ క్యూరియాసిటీ నెలకొంది. హాలీవుడ్ రేంజ్ విజువల్ ట్రీట్‌తో ప్రేక్షకులు ఊహించని కంటెంట్ ఇవ్వబోతున్నాడు డైరెక్టర్ నాగ్. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలకపాత్రలు పోషిస్తుండగా.. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు వైజయంతి మూవీస్. ఇక ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. కల్కి 2898 ఏడీ చిత్రాన్ని జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తుండగా.. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రయూనిట్.
అటు ప్రభాస్, నాగ్ మిగతా మూవీ టీం వరుస ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కల్కి సినిమా నుంచి ఫస్ట్ ప్రమోషనల్ సాంగ్ ప్రోమో రిలీజ్ చేసింది చిత్రయూనిట్. భైరవ యాంథమ్ పేరుతో రిలీజ్ చేసిన ఈ సాంగ్ ప్రోమో అదిరిపోయింది. పంజాబీ సింగర్ దిల్జీత్ దోసాంజేతో కలిసి ప్రభాస్ ఈ ప్రమోషనల్ పాటలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఈ పాట కథలో అంతర్భాగంగా ఉంటుందని.. అందుకే ప్రమోషన్ కోసం స్పెషల్ సాంగ్ షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ లుక్ మాత్రం ఎంతో స్టైలీష్ గా ఉంది. ఇక ఈ పాట ఫుల్ వీడియోను రేపు (ఆదివారం జూన్ 16న) రిలీజ్ చేయనున్నారు.
ఈ సినిమాను తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషలలో రిలీజ్ చేయనున్నారు. మరోవైపు కల్కి సినిమాలో భైరవ ఉపయోగించే బుజ్జి కారు దేశం మొత్తం చక్కర్లు కొడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అలాగే ఓటీటీలో బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ సిరీస్ కూడా ఆకట్టుకుంది. కల్కి సినిమాకు ముందు నుంచి ప్రమోషన్స్ సరికొత్తగా ప్లాన్ చేశారు మేకర్స్. ఇక త్వరలోనే ప్రభాస్, దీపికాతోపాటు చిత్రయూనిట్ ప్రెస్ మీట్స్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.