
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న నటుడు రచ్చ రవి. జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు రచ్చ రవి. నందమూరి బాలకృష్ణతో జబర్దస్త్ రచ్చ రవికి ఏర్పడిన అనుబంధం, ఆయన వ్యక్తిత్వంపై రవి గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బాలయ్యతో తనకున్న ప్రత్యేకమైన జ్ఞాపకాలను, ఆయన పట్ల తనకున్న గౌరవాన్ని పంచుకున్నారు. రవి మాట్లాడుతూ.. రవి బాలకృష్ణకు ప్రత్యేకంగా తన స్వగ్రామం నుంచి ప్రేమగా తలకాయ కూర పంపిన ఘటనతో వారి బంధం మరింత బలపడిందని. బాలయ్య ఆ కూరను మెచ్చుకుంటూ, బాలయ్య తనకు స్వయంగా ఫోన్ చేసి, “టిఫిన్లో తిన్న, లంచ్లో తిన్న, ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరీ తిన్న రవి. టేస్ట్ చాలా బాగుంది. అమ్మకు చెప్పు. అమ్మ దీవెనలు నాకు, నా దీవెనలు నీకు ఎప్పుడూ ఉంటాయి” అని చెప్పడం రవిని ఎంతగానో ఆశ్చర్యపరిచిందట. ఒక పెద్ద స్టార్ స్వయంగా ఇలా ఫోన్ చేసి అభినందించడం, ఆశీర్వదించడం రవికి జీవితంలో మరిచిపోలేని అనుభూతినిచ్చిందని తెలిపాడు.
ఆ తర్వాత, దుబాయ్‌లో జరిగిన ఐఫా అవార్డుల వేడుకలో బాలకృష్ణ తనను “రచ్చ రవన్న” అని పిలవడం రవికి ఇంకో అద్భుతమైన క్షణంగా నిలిచిందని అన్నారు. “ఆయనకున్న హోదాకు నన్ను రవి అనొచ్చు, ఒరేయ్ అనొచ్చు, తమ్ముడు అనొచ్చు. కానీ బాలయ్య బాబు గారి నోట్లోకెళ్ళి రచ్చ రవన్న అని పిలిపించుకుంటే ఎట్లుంటది అన్న?” అని రవి ఆనందంగా పంచుకున్నారు. ఈ సంఘటన బాలకృష్ణ అందరి పట్ల చూపించే అపారమైన గౌరవానికి నిదర్శనమని రవి తెలిపారు.
భగవంత్ కేసరి సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్ణ ప్రదర్శించిన క్రమశిక్షణ, వినయం రవిని ఎంతగానో ఆకట్టుకున్నాయట. రాత్రిపూట షూటింగ్‌లు అయినప్పుడు, తెల్లవారుజామున రెండు గంటలకు కూడా, బాలకృష్ణ వెళ్లే ముందు డైరెక్టర్ అనిల్ రావిపూడి, నటి కాజల్, కెమెరామెన్‌కి చెప్పి, వారి అనుమతి తీసుకుని వెళ్లేవారట. “రచ్చ రవన్న ఎక్కడ ఉన్నాడు అని అడిగి, నేను వెళ్లొస్తా, మళ్ళీ నేను మూడన్నరకే లేవాలి” అని చెప్పి వెళ్లడం ఆయన ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనమన్నారు. ఈ సంఘటనల ద్వారా బాలయ్య ఎంత పద్ధతిగా, మర్యాదగా ఉంటారో రవి తెలిపారు. సాధారణంగా బాలకృష్ణ గురించి వినే అనేక విషయాలు నిజం కాదని, స్వయంగా కలిశాక ఆయన మర్యాద, క్రమశిక్షణ తనను ఆశ్చర్యపరిచాయని రవి స్పష్టం చేశారు. చిన్న ఆర్టిస్టులైనా, పెద్ద ఆర్టిస్టులైనా అందరినీ ఒకేలా గౌరవిస్తారని, ఆయనలో చిన్న, పెద్ద తేడాలు ఉండవని రవి ప్రశంసించారు. పనిలో తప్పు చేసినవారిపైనే ఆయన ఆవేశం తప్ప, దర్శకులు, నిర్మాతలు వంటివారిపై కాదని, బాలకృష్ణ వ్యక్తిత్వాన్ని దగ్గరగా చూసి తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని రచ్చ రవి తెలిపారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి