
జబర్దస్త్ షో గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సుమారు 13 ఏళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోందీ కామెడీ షో. ముఖ్యంగా వీకెండ్ లో ఆడియెన్స్ కు మంచి ఎంటర్ టైన్మెంట్ అందిస్తూ అందరికీ చేరవైంది జబర్దస్త్. ఈ క్రమంలోనే ఎంతో మంది ట్యాలెంటెడ్ నటీనటులను తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించిందీ బుల్లితెర కామెడీ షో. జబర్దస్త్ లో కమెడియన్లుగా పనిచేసిన సుడిగాలి సుధీర్, గెటప్ శీను, వేణు, హైపర్ ఆది, రామ్ ప్రసాద్, రాకింగ్ రాకేష్, ధనాధన్ ధన్ రాజ్, చమ్మక్ చంద్ర, అదిరే అభి, జీవన్, రాకెట్ రాఘవ… ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. హీరోలుగా, డైరెక్టర్లుగా, సహాయక నటులుగా, కమెడియన్లుగా ఆకట్టుకుంటున్నారు. అయితే జబర్దస్త్ కు రాక ముందు వీరు అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. పొట్ట కూటి కోసం చిన్న చితకా పనులు, ఉద్యోగాలు చేశారు. చివరకు ఒకతను అయితే హైదరాబాద్ లోని రోడ్లపై ఫినాయిల్, యాసిడ్ బాటిల్స్ కూడా అమ్మాడు. అతను మరెవరో కాదు లేడీ గెటప్పులతో జబర్దస్త్ కు మరింత క్రేజ్ తీసుకొచ్చిన చమ్మక్ చంద్ర.
జబర్దస్త్ లో టాప్ కమెడియన్ గా ఓ వెలుగు వెలిగాడు చమ్మక్ చంద్ర. తన కామెడీతో బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. ప్రస్తుతం ఈ షోలో లేనప్పటికీ సినిమాల్లో తన ట్యాలెంట్ ను చూపిస్తున్నాడు. స్టార్ హీరోల సినిమాల్లో కమెడియన్ గా, సహాయక నటుడిగా రాణిస్తున్నాడు. అయితే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన చమ్మక్ చంద్ర జబర్దస్త్ కు రాకముందు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నట్లు తెలిపాడు. ‘ ఒకప్పుడు నేను హైదరాబాద్ రోడ్లపైన ఫినాయిల్, యాసిడ్ అమ్మాను. అప్పుడు నా ఫ్యామిలీ ఆర్థిక సమస్యల్లో ఉంది. అందుకే ఈ పని చేశాను. అయితే ఫినాయిల్, యాసిడ్ అమ్మినందుకు నేనెప్పుడూ బాధ పడలేదు. ఇప్పుడు నాకు దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. అందుకు చాలా సంతోషంగా ఉంది’ అని ఎమోషనల్ అయ్యాడు చమ్మక్ చంద్ర. ప్రస్తుతం ఈ స్టార్ కమెడియన్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.