
ముఖ్యంగా నలుగురు యువ హీరోలు ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద భారీ రిస్క్ చేస్తున్నారు. వారి సినిమాల బడ్జెట్ వివరాలు చూస్తుంటే ట్రేడ్ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. అతను ఒకప్పుడు చిన్న సినిమాలతో కెరీర్ మొదలుపెట్టాడు.. కానీ ఇప్పుడు ఏకంగా పీరియాడిక్ వార్ మూవీతో పాన్ ఇండియా లెవల్లో యుద్ధానికి సిద్ధమయ్యాడు. మరొకరు తన రూట్ మార్చి రా అండ్ రస్టిక్ పొలిటికల్ డ్రామాతో భీభత్సం సృష్టించేందుకు వస్తున్నాడు. ఇంకొకరు తన కెరీర్ లోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత ఖరీదైన సోషియో ఫ్యాంటసీ కథను నమ్ముకున్నాడు. ఇలా మన టాలీవుడ్ కుర్ర హీరోలు ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలతో బాక్సాఫీస్ పై దండయాత్రకు రెడీ అయ్యారు. ఆ నలుగురు హీరోలు, వారి భారీ ప్రాజెక్టుల విశేషాలు మరేదో కాదు.. ఇక్కడే ఉన్నాయి.
Swayambhu
నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం ‘స్వయంభూ’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ‘కార్తికేయ 2’ తర్వాత ఆయన మార్కెట్ అమాంతం పెరగడంతో, నిర్మాతలు భువన్ సాగర్, శ్రీకర్ బసిరెడ్డి ఈ పీరియాడిక్ డ్రామా కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. అద్భుతమైన సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్ కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. నిఖిల్ ఒక యోధుడిగా కనిపిస్తున్న ఈ సినిమా గ్లింప్స్ ఇప్పటికే అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది.
Sambarala Yetigattu
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ‘సంబరాల ఏటి గట్టు’ కూడా అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కుతోంది. ‘హనుమాన్’ వంటి బ్లాక్ బస్టర్ నిర్మించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను నిర్మిస్తోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం కోసం భారీ సెట్స్, ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేశారు. తేజ్ కెరీర్ లోనే ఇది అత్యంత భిన్నమైన, ఖరీదైన సినిమా కావడం విశేషం.
Vrushakarma
అక్కినేని యువ హీరో నాగ చైతన్య తన శైలిని పూర్తిగా మార్చేసి ‘వృష కర్మ’ అనే భారీ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించారు. సుకుమార్ రైటింగ్స్ తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తోంది. చైతన్య కెరీర్ లో ఇప్పటివరకు ఏ సినిమాకు చేయనంత ఖర్చు ఈ సినిమా కోసం చేస్తున్నారని సమాచారం. భారీ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
Paradise
నేచురల్ స్టార్ నాని, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న ‘ప్యారడైజ్’ బడ్జెట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉండబోతోంది. కథ డిమాండ్ మేరకు భారీ సెట్స్, వందల మంది జూనియర్ ఆర్టిస్టులతో చిత్రీకరణ జరుపుతున్నారు. నాని ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని మార్కెట్ కు మించి నిర్మాతలు రిస్క్ చేస్తున్నారని టాక్. కంటెంట్ మీద నమ్మకంతో నిర్మాతలు చేస్తున్న ఈ భారీ సాహసాలు ఫలిస్తే, మన యంగ్ హీరోల మార్కెట్ రేంజ్ మరో స్థాయికి చేరుతుంది. ఒకవేళ పొరపాటున తేడా కొడితే మాత్రం భారీ నష్టాలు తప్పవు.