
నారా లోకేశ్ యువగళం యాత్రలో గుండెపోటుతో కుప్పకూలారు ప్రముఖ సినీ నటుడు నందమూరి తారకరత్న. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే తారకరత్న పరిస్థితి విషమంగా ఉండడంతో ఎక్మోపై చికిత్స అందిస్తున్నట్లు బెంగళూరు ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ఆయన ఆరోగ్యాన్ని 10 మంది వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ విషయం తెలుసుకున్న నందమూరి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు బెంగళూరు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. మరోవైపు తారకరత్న త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కాగా సినీ ప్రముఖులు తారకరత్న త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు. ఈక్రమంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నందమూరి హీరో ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈ వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. తారకరత్న అన్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మీరు ఆరోగ్యంగా, మరింత దృఢంగా తిరిగి రావాలని ఆ దేవుడిని ఆశిస‍్తున్నా. మా ప్రార్థనలు మీకు ఎప్పుడు అండగా ఉంటాయి ‘ అని పోస్ట్ చేశాడు సాయిధరమ్ తేజ్.
అంతకుముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తారకరత్న త్వరగా కోలుకోని తిరిగి రావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘నందమూరి తారకరత్న కుప్పంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడం బాధాకరం. మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలిస్తున్నారని సమాచారం అందింది. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తారకరత్న త్వరగా సంపూర్ణ ఆరోగ్యవంతులై తిరిగి తన రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నాం కావలని ఆకాంక్షిస్తున్నాను’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు పవన్.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..