
చిన్న సినిమా ట్యాగ్ తో వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం బలగం. జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి దర్శకుడిగా మారి ఈ సినిమాను తెరకెక్కించాడు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, రూపా లక్ష్మి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధానపాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాత ‘దిల్ రాజు’ సమర్పణలో, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి లు ‘బలగం’ సినిమాను నిర్మించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది. 2023 మార్చి 03న రిలీజైన బలగం సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా ఇందులోని కొన్ని సన్నివేశాలు ఆడియెన్స్ తో కన్నీళ్లు పెట్టించాయి. గతంలో ఎన్నడూ లేనంతగా మారుమూల పల్లెల్లో సైతం ప్రత్యేక తెరలు ఏర్పాటు చేసి ఈ సినిమాను ప్రదర్శించం విశేషం. ఓటీటీలోనూ ఈ బలగం సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే అంతర్జాతీయంగానూ ఈ సినిమాకు పలు అవార్డులు, ప్రశంసలు వచ్చాయి.
అయితే ఈ బ్లాక్ బస్టర్ బలగం సినిమాకు హీరోగా ప్రియదర్శి ఫస్ట్ ఛాయిస్ కాదట. మొదట దర్శకుడు వేణునే ఈ సినిమాలో కథానాయకుడిగా నటించాలనుకున్నాడట. అయితే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారో లేదో నన్న అనుమానంతో వేణు వెనక్కి తగ్గాడట. ఆ తర్వాత ఎంటర్ టైన్మెంట్ కింగ్ శ్రీ విష్ణు దగ్గరకు ఈ సినిమా కథ వెళ్లిందట. అతను కూడా కథ విని బాగా ఇంప్రెస్ అయ్యాడట. అయితే అప్పటికీ తెలంగాణ యాసపై తనకు అంత పట్టులేకపోవడంతో ఈ సినిమాను వదులుకున్నారట. ఇక హీరోయిన్ విషయంలోనూ చాలా మార్పులు జరిగాయి. మొదట ఈ సినిమాలో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్యను కథానాయికగా తీసుకోవాలని అనుకున్నారట. అయితే అప్పటికే బేబీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడంతో ఈ సినిమాను చేయలేకపోయిందట. దీంతో చివరకు ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ లు లైన్లోకి వచ్చారట.
ఇక బలగం తర్వాత సేమ్ టు సేమ్ ఇలాంటి సినిమాతోనే ఆడియెన్స్ ముందుకు రానున్నడు జబర్దస్త్ వేణు. ఎల్లమ్మ పేరుతో మరోసారి తెలంగాణ నేపథ్యంతోనే ఓ డివోషనల్ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించనున్నాడు. సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఇందులో హీరోగా నటిస్తుండడం విశేషం. దిల్ రాజు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.