
ఇప్పుడు స్టార్ స్టేటస్ అనుభవిస్తోన్న తారల్లో చాలా మంది గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డవారే. పొట్ట కూటి కోసం చిన్న చితకా పనులు, ఉద్యోగాలు చేసిన వారే. అలాంటి వారిలో ఈ స్టార్ హీరో కూడా ఒకడు. ఇప్పుడు కోట్లాది ఆస్తులకు యజమాని అయిన ఇతను చిన్న వయసులోనే బండెడు కష్టాలు చూశాడు. మొదట ఓ కాఫీ షాప్ లో పని చేశాడు. ఓ రెస్టారెంట్‌లో కూడా వెయిటర్ గా చేశాడు. ఇలా ఓ వైపు చిన్న పనులు చేస్తూనే చదువును కొనసాగించాడు. ఇందుకోసం రోజూ నాలుగు లోకల్ ట్రైన్స్ మారేవాడు. 16 గంటలు పనిచేసేవాడు. చేతిలో సరిపడా డబ్బులు లేని రోజుల్లో పార్లీజీ బిస్కెట్, నీళ్లు.. ఈ రెండింటితోనే కడుపు నింపుకొనేవాడు. ఇలా కష్టాలు పడుతూనే 16 ఏళ్ల వయసులోనే కెమెరా ముందుకు వచ్చాడు. మొదట బుల్లితెరపై సక్సెస్ అయ్యాడు. ఆపై వెండితెరపైనా మెరిశాడు. కట్ చేస్తే.. ఇప్పుడు స్టార్ హీరోగా అందరి మన్ననలు అందుకుంటున్నాడు. ఎంతలా అంటే.. ఈ హీరో నటనకు ప్రతీకగా ఏకంగా జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం కూడా వచ్చింది. ఇంతకీ అతను ఎవరనుకుంటున్నారా? 12th ఫెయిల్ హీరో విక్రాంత్ మాస్సే. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటోన్న అతను లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఇదే క్రమంలో తాను పడిన కష్టాలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు.
‘గతంలో నేను చాలా సార్లు పార్లీజీ బిస్కెట్, నీళ్లు.. ఈ రెండింటితోనే కడుపు నింపుకునేవాడిని. చిన్న చితకా పనులు చేస్తూనే ఓ డ్యాన్స్ గ్రూప్‌కు అసిస్టెంట్ ఇన్‌స్ట్రక్టర్‌గా వర్క్ చేశాను. ఇక నేను ఓ షో కోసం దాదాపు 8 నెలలపాటు కష్టపడ్డాను. తీరా చూస్తే ఆ షో ప్రసారమే కాలేదు. పైగా నాకు ఇవ్వాల్సిన డబ్బు కూడా సగమే ఇచ్చారు. కొన్నేళ్ల తర్వాత ఆ షోను అర్ధరాత్రి టీవీలో ప్రసారం చేశారు. అయితే ఈ షో కోసం నేనెంత కష్టపడ్డానో గుర్తించిన ఓ మహిళా నిర్మాత తన ప్రొడక్షన్ బ్యానర్‌లో పనిచేసే అవకాశాన్ని కల్పించింది. అలా బుల్లితెరకు.. అక్కడినుంచి వెండితెరకు పరిచయమయ్యాను’ అని ఎమోషనల్ అయ్యాడు విక్రాంత్.
బాలికా వధు (చిన్నారి పెళ్లికూతురు), ఖుబూల్ హై వంటి సీరియల్స్‌తో మెప్పించాడు విక్రాంత్. ఆ తర్వాత లూటేరా చిత్రంతో 2013లో తొలిసారి వెండితెరపై కనిపించాడు. 12th ఫెయిల్ మూవీతో ఏకంగా జాతీయ అవార్డు అందుకున్నాడు. ప్రస్తుతం ఓ రోమియో అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 13న విడుదల కానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.