సినిమా థియేటర్లను సీజ్ చేస్తూ.. వాటికి తాళం వేసే అధికారం తహసీల్దార్లకు లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో సినిమా ప్రదర్శనలో నిబంధనలు ఉల్లంఘించారని పలు థియేటర్లను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా సోంపేటలోని శ్రీనివాస మహల్ థియేటర్‌ను స్థానిక తహసీల్దార్ సీజ్ చేసి తాళం వేశారు. దీంతో తహసీల్దార్ తీరును సవాల్ చేస్తూ సదరు థియేటర్ యాజమాని హైకోర్టును ఆశ్రయించారు.
ఈరోజు థియేటర్ యాజమాని వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఇందులో భాగంగా .. సినిమా థియేటర్లను సీజ్ చేసి అధికారం స్థానిక తహసీల్దార్‌కు లేదని స్పష్టం చేసింది. లైసెన్స్ జారీ చేసే అధికారం ఉన్న జాయింట్ కలెక్టర్ అధికారమిచ్చిన వ్యక్తి మాత్రమే జప్తు చేయాల్సి ఉంటుందని తెలిపింది. మూసివేసిన థియేటర్‌ను వెంటనే తెరవాలని అధికారులకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్ ఆదేశించారు.. లైసెన్స్ పునరుద్ధరణ వ్యవహారం అధికారుల వద్ధ ఉన్న నేపథ్యంలో సినిమాలను ప్రదర్శించుకోవచ్చని తెలిపింది.
ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా ఏపీలో సినిమా టికెట్స్ రేట్స్ తగ్గించడంపై సినిమాటోగ్రఫి మంత్రి పేర్ని నానికి.. థియేటర్ యాజమానులకు.. సినీ ప్రముఖులకు మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఏపీలోని పలు జిల్లాల్లోని థియేటర్లు నిబంధనలను పాటించకుండా సినిమా ప్రదర్శన చేస్తున్నారంటూ స్తానిక తహసీల్దార్ థియేటర్లను సీజ్ చేశారు. గతంలో థియేటర్లపై దాడులు నిర్వహించిన ప్రభుత్వ తీరును సినిమాటోగ్రఫి మంత్రి సమర్థించారు. చట్టం మేరకే థియేటర్లపై చర్యలు తీసుకునే అధికారం జాయింట్ కలెక్టర్లకు ఉంటుందని పేర్ని నాని స్పష్టం చేశారు.
Ram Gopal Varma: సోషల్ మీడియాలో అప్సరా రాణితో ఆర్జీవి రచ్చ.. ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్నా అంటూ..