
గుంటూరు కారం ప్రీమియర్ షోలు, మిడ్ నైట్ షోల అనుమతుల కోసం చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పలు చోట్ల అనుమతులు లభించాయి. ఇక ఈ సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో కూడా ఓ క్లారిటీ వచ్చేసింది. ఈ మూవీ టికెట్ ధరని రూ.50 వరకు పెంచుకునే అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. అధికారికంగా జీవో కూడా విడుదల చేసింది. ఇటీవల విడుదలైన ప్రభాస్ సలార్ చిత్రం కంటే ఇది ఎక్కువ మొత్తమే అని చెప్పొచ్చు. సలార్ చిత్రానికి 40 రూపాయలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పుడు గుంటూరు కారం సినిమాకు రూ. 50 పెంచుకునేలా అనుమతి ఇచ్చింది. ఇక ఇప్పటికే గుంటూరు కారం సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. సింగిల్ స్క్రీన్లలో రూ.65, మల్టీఫ్లెక్స్ థియేటర్లలో రూ.100 వరకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది. అలాగే మహేష్ ఫ్యాన్స్ కోసం బెనిఫిట్ షోల ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 23 చోట్ల ఈనెల 12న అర్ధరాత్రి ఒంటిగంటకు బెనిఫిట్ షోలు వేయనున్నారు మేకర్స్. ఇక ఇప్పుడు ఆంధ్రలోనూ గుంటూరు కారం సినిమా టికెట్స్ పెంచుకోవడానికి ప్రభుత్వం ఓకే చెప్పింది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తోన్న ఈ మూవీలో మీనాక్షి, శ్రీలీల, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, జగపతి బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. హరికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ గురించి చెప్పక్కర్లేదు. ఇదివరకూ ఎన్నడూ చూడని మహేష్ ను ఈ సినిమాలో చూపించనున్నారు గురూజీ. అతడు, ఖలేజా తర్వాత త్రివిక్రమ్, మహేష్ కాంబోలో వస్తున్న గుంటూరు కారం ఈసారి పండక్కి థియేటర్లలో ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందో చూసేందుకు ఫ్యాన్స్ ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.
సంక్రాంతి కానుకగా గుంటూరు కారం ఘాటు చూపించేందుకు మహేష్ బాబు జనవరి 12న థియేటర్స్ లోకి దిగిపోతున్నాడు. నిన్న గుంటూరులో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకలో మహేష్ మాట్లాడుతూ ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. ఇక పై తనకు ప్రేక్షకులే అమ్మా, నాన్న అని.. తన సినిమాలు ఎలా ఉంటాయో అడియన్స్ చెప్పాలంటూ భావోద్వేగానికి గురయ్యాడు.