
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం రణబాలి ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. ఈ క్రమంలో తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై సినిమా ప్రమోషన్స్‌లో భాగం కావడం ఆసక్తిని పెంచుతోంది. విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్‌తో కలిసి అన్నామలై ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సాయి దీపక్ కూడా ఈ ఇంటర్వ్యూలో
పాల్గొన్నారు. కేవలం సినిమా విశేషాలకే పరిమితం కాకుండా భారతీయ చరిత్ర, వలసవాదం వంటి కీలక అంశాలపై కూడా వీరు చర్చించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. సినిమా ప్రచారంలో రాజకీయ నేపథ్యం ఉన్న ప్రముఖులు పాల్గొనడం సాధారణంగా ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తుంది. అందులోనూ అన్నామలై, సాయి దీపక్ వంటి వ్యక్తులతో విజయ్ దేవరకొండ ఇంటర్వ్యూ చేయడం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ చర్చలో ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి? ‘రణబాలి’ కథకు చరిత్రతో ఉన్న సంబంధం గురించి ఏమైనా వివరాలు వెల్లడించారా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కొంతకాలంగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు. తాజాగా అన్నామలైతో నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రచారానికి మరో ఆకర్షణగా నిలవనుంది. ఈ వీడియోను చిత్ర బృందం త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది. రణబాలి చిత్రాన్ని 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ ఇండియాలో చోటుచేసుకున్న వాస్తవ సంఘటనల ప్రేరణతో రూపొందిస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. చారిత్రక నేపథ్యానికి యాక్షన్, డ్రామాను జోడిస్తూ దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ శింగనమల బొబ్బిలి రణబాలి పాత్రలో కనిపించనుండగా, రష్మిక మందన్న ఆయన భార్య జయమ్మగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. దసరా సందర్భంగా అక్టోబర్ 16న థియేటర్లలోకి రానుంది ఈ సినిమా..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.