
బ్లాక్ బస్టర్ ‘బేబీ’ జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ’90s’ వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న యువ దర్శకుడు ఆదిత్య హాసన్, ఈ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయమయ్యారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ‘బేబీ’ జోడీ, ’90s’ దర్శకుడి కలయికలో సితార నిర్మించిన సినిమా కావడంతో విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా యువతలో తారాస్థాయి అంచనాలను ఏర్పరచుకున్న ‘ఎపిక్’ చిత్రం.. సెప్టెంబర్ 11 విడుదల తేదీ కాగా, సెప్టెంబర్ 10 రాత్రి ప్రీమియర్స్ తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. సహజమైన హాస్యం, సున్నితమైన భావోద్వేగాలతో ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తోంది. సినిమాకి అద్భుతమైన స్పందన లభిస్తుండటంతో చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించి.. తమ సంతోషాన్ని పంచుకోవడంతో పాటు, ప్రేక్షకులకు కృతఙ్ఞతలు తెలియజేసింది.
కథానాయకుడు ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. “ప్రీమియర్స్ నుంచే సినిమాకి మంచి స్పందన లభించింది. ఇందులో ఉన్న కంటెంట్ చూసి, ఇది ఐదేళ్ల తర్వాత రావాల్సిన సినిమా అంటున్నారు. ప్రేమ కథ, కుటుంబ భావోద్వేగాలు ప్రతి ఒక్కరికీ నచ్చుతున్నాయి. ఇది నిజాయితీగా చేసిన సినిమా. నేను విదేశాల్లో చదువుకున్నాను. అందుకే ఈ కథకు బాగా కనెక్ట్ అయ్యాను. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన యువకుడి ప్రయాణం, ఆ భావోద్వేగాలు, తండ్రితో జరిగే సంభాషణలు ఇవన్నీ నా మనసుకు దగ్గరయ్యాయి. 90s సిరీస్ చూసినప్పుడే ఆదిత్య హాసన్ గొప్ప రచయిత అనుకున్నాను. ఇప్పుడు ‘ఎపిక్’ చూసిన తర్వాత కూడా అందరూ డైలాగ్స్ గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. సినిమాలో ఆదిత్య పాత్రకు, ఆ రచనకు, ఆ ప్రేమ కథకు నేను కనెక్ట్ అయ్యాను. అందుకే ఎంతో నమ్మి ఈ సినిమా చేశాను. ఇప్పుడు ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన వస్తుండటం సంతోషంగా ఉంది. ఫస్ట్ హాఫ్ లో కామెడీ, సెకండ్ హాఫ్ లో ఎమోషన్స్ అందరికీ నచ్చుతున్నాయి.” అన్నారు.
కథానాయిక వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. “సినిమా చూసి ఎందరో నాకు మెసేజ్ లు చేశారు. ఆదిత్య పాత్ర గురించి, కడలి పాత్ర గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. తెరపై తమను తాము చూసుకున్నట్టు ఉందని ఎందరో నాకు మెసేజ్ లు చేశారు. మేమందరం నమ్మి చేసిన కొత్త ప్రయత్నమిది. నా ఫ్రెండ్స్, కజిన్స్ తో కలిసి నేను సినిమా చూశాను. పీరియడ్స్, PCOD వంటి అంశాల గురించి సినిమాలో ప్రస్తావించడాన్ని వారు ప్రశంసించారు. ఆ పరిస్థితి ఎవరికైనా చెప్పినా అర్థంకాదు. అది అనుభవించే అమ్మాయిలకు మాత్రమే తెలుస్తుంది. ఆ సమయంలో తనపై కేర్ చూపించేవారు కావాలని ప్రతి అమ్మాయికి అనిపిస్తుంది. ఈ సినిమాలో అబ్బాయి నిజాయితీగా కేర్ చూపిస్తాడు, ప్రేమిస్తాడు. అది అందరికీ నచ్చుతుంది. ముఖ్యంగా అమ్మాయిలకు ఈ సినిమా బాగా నచ్చుతోందని అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.