
అల్లరి నరేష్ రీసెంట్ గా రంభ ఊర్వశి మేనక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి మరణం వంటి వ్యక్తిగత విషాదాల మధ్య నటుడిగా తన వృత్తిని కొనసాగించడం ఎంత కష్టమో వివరించారు. నటుల జీవితం బయట కనిపించినంత కూల్‌గా, సులభంగా ఉండదని ఆయన స్పష్టం చేశారు. సీమటపాకాయ్ సినిమాలోని పాటల చిత్రీకరణ సమయంలో తన తండ్రి మరణించారని, ఆ సమయంలో తన బాధను గుండెల్లో దాచుకొని నటుడిగా నటించడం అత్యంత కఠినమైన పని అని అన్నారు. సినిమా విడుదలైనప్పుడు ప్రేక్షకులు తమ వ్యక్తిగత కష్టాలను తెలుసుకోరని, కేవలం సినిమాను మాత్రమే చూస్తారని పేర్కొన్నారు.
తన 15 ఏళ్ల సినీ కెరీర్‌లో అరుదైన అవకాశాలు లభించాయని, లెజెండరీ దర్శకులు బాపు అలాగే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె. విశ్వనాథ్‌లతో పనిచేయడం తన అదృష్టమని నరేష్ తెలిపారు. చాలా మంది దర్శకులతో పనిచేసినప్పటికీ, బాపు, కె. విశ్వనాథ్‌ల దర్శకత్వంలో నటించడం ఒక ప్రత్యేకమైన అనుభవమని, ఇది ఎప్పటికీ తన జ్ఞాపకాల్లో నిలిచిపోతుందని అన్నారు. బాపుగారితో పనిచేసిన అనుభవాన్ని అల్లరి నరేష్ వివరంగా వివరించారు.
బాపుగారితో కలిసి పనిచేయడం హాలీవుడ్ ప్రాజెక్ట్‌కు సమానమని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగు సినిమాలలో సాధారణంగా స్టోరీబోర్డులు ఎక్కువగా ఉండవని, కానీ బాపుగారు తమ సినిమాలో డైలాగ్‌లతో పాటు కథ, పాత్రల ప్రవేశం, సన్నివేశాల రూపురేఖలను చిత్రాలతో సహా ముందుగానే సిద్ధం చేసి ఉంచేవారని నరేష్ చెప్పారు. ఇది నటులకు సన్నివేశాలను అర్థం చేసుకోవడానికి, తమ పాత్రలలో లీనమవ్వడానికి చాలా సహాయపడిందని ఆయన ప్రశంసించారు. బాపుగారి ఫ్రేమింగ్, ఆయనకు సినిమాలపై ఉన్న పట్టు అద్భుతమని నరేష్ కొనియాడారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, బాపుగారికి ప్రపంచ సినిమాపై విస్తృతమైన అవగాహన ఉందని, మార్లోన్ బ్రాండో వంటి నటుల సినిమాల గురించి కూడా ఆయన చర్చించేవారని నరేష్ ఆశ్చర్యంగా చెప్పారు. బాపుగారు ఆధునిక ఆలోచనలతో ఎల్లప్పుడూ అప్‌గ్రేడ్‌గా ఉండేవారని, ఆయన ఒకే వ్యక్తి కాదని, ఆయనకు వేరే ఆలోచనలు కూడా ఉండేవని తెలిపారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.