వీరసింహా రెడ్డి సక్సెస్ మీట్లో పాల్గొన్న నందమూరి నటసింహం బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. ఈ ఈవెంట్లో ఏఎన్ఆర్.. ఎస్వీ రంగారావులను ఉద్దేశిస్తూ బాలయ్య మాట్లాడిన మాటలపై ఇప్పటికే నాగచైతన్య, అఖిల్ సీరియస్ అయ్యారు. దీంతో ఇండస్ట్రీలో నందమూరి.. అక్కినేని వారసుల మధ్య వార్ మొదలైంది. ఇక బాలయ్య మాటలపై సోషల్ మీడియా వేదికగా అక్కినేని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏఎన్ఆర్ కుటుంబానికి క్షమపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ బహిరంగ లేఖ విడుదల చేశారు. తమ ఆరాధ్య నటుడు అక్కినేని నాగేశ్వరరావును కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని.. ఆ కుటుంబానికి బాలయ్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
“సినిమా హీరో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణగారు తన సినిమా సక్సెస్ మీట్ లో వాళ్ల నాన్నగారి ముందు వీళ్లంతా ఎవరూ అక్కినేని, తొక్కినేని అంటూ అసభ్యకర పదజాలంతో స్టేజ్ మీద మాట్లాడటం తన అహంకార పూరిత అవలక్షణంగా భావించాల్సి వస్తోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీ కళాకారులను మద్రాసులోనే అంతం అవకుండా మొట్ట మొదట హైదరాబాదా కు తీసుకువచ్చి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఎంతో సేవలు చేసేలా చేసి.. తన నటనతో.. సేవాభావంతో ఎంతో మందికి ఆర్టిస్ట్ లకు అవకాశాలు కల్పిస్తూ ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్న స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన నందమూరి బాలకృష్ణ గారి అహంకారం మాటలు మేము కండిస్తున్నాము.
మీ నాన్నకు అన్యాయం చేసి అధికారం లాక్కుంటే.. మీ నాన్న మాటల్లో ఆ నీచుడిని చంపి నా దగ్గరికి రా బాలయ్య అంటూ ఆరోజు మీ నాన్న నీకు చెప్తే ఈరోజుకు ఒక కొడుకుగా నెరవేర్చాలని లేని నీ హీరోయిజం ఏ మాత్రానికి అంటూ మేము ప్రశ్నించవచ్చు. కానీ మా అక్కినేని అభిమానులకు సంస్కారం ఉంది. కావున ఇక మీద మీ అహంకార కుల మత్తు మాటలు కట్టిబెట్టి అక్కినేని కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము. లేనిచో అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ వారు చేసే విభిన్న కార్యక్రమాలు మీరు చాలా బాధపడాల్సి వస్తుందని అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ హెచ్చరిస్తుంది” అంటూ లేఖ విడుదల చేశారు.