Taraka Ratna: ఇక సెలవు.. కన్నీటి వీడ్కోలు మధ్య తారకరత్న అంత్యక్రియలు పూర్తి

ఉదయం మోకిలాలోని నివాసం నుంచి చాంబర్‌కు భౌతికకాయాన్ని తరలించేప్పుడు పూర్తి చేయాల్సిన కార్యక్రమాల్ని తారకరత్న కుమారుడి ద్వారా చేయించారు

Taraka Ratna: ఇక సెలవు.. కన్నీటి వీడ్కోలు మధ్య తారకరత్న అంత్యక్రియలు పూర్తి
Tharakarathna

Updated on: Feb 20, 2023 | 4:42 PM

తారకరత్న అంత్యక్రియలు పూర్తయ్యాయి.  బాలయ్యతోపాటు కుటుంబ సభ్యులు పాడెమోశారు. చంద్రబాబు కూడా అంతిమయాత్ర సాగుతున్న వాహనంలోనే వచ్చారు. విజయసాయిరెడ్డి కూడా తారకరత్న అంతిమసంస్కారాల్లో పాల్గొన్నారు. ఉదయం మోకిలాలోని నివాసం నుంచి చాంబర్‌కు భౌతికకాయాన్ని తరలించేప్పుడు పూర్తి చేయాల్సిన కార్యక్రమాల్ని తారకరత్న కుమారుడి ద్వారా చేయించారు. చాంబర్‌ నుంచి మహాప్రస్థానానికి తీసుకువెళ్తున్నప్పుడు మిగతా కార్యక్రమాల్ని ఆయన తండ్రి మోహనకృష్ణ శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. కన్నీటి వీడ్కోలు మధ్య తారకరత్న అంత్యక్రియలు జరిగాయి.

అబ్బాయ్‌ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన బాబాయ్‌ బాలయ్యలో తారకరత్న ఇక లేడనే బాధ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన మొహం చిన్నపోయింది. 23 రోజులపాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న క్షేమంగా బయటపతాడని బలంగా నమ్మినా విధిని తప్పించలేకపోయామనే బాధ కుటుంబసభ్యుల్లో కనిపిస్తోంది.. బాలకృష్ణతోపాటు కుటుంబ సభ్యులంతా పాడెమోశారు.

ఒకటో నంబర్‌ కుర్రాడు.. ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు. తారకరత్న వ్యక్త్విత్వం తెలిసినవాళ్లు అతని గురించి చెప్పే మాట ఇదే. అందరితో ఆత్మీయంగా మాట్లాడుతూ, కలుపుగోలుగా ఉంటూ తిరిగే వ్యక్తి ఇవాళ తమ మధ్య లేడనే నిజాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇండస్ట్రీ ప్రముఖులంతా ఇవాళ చాంబర్‌కు తరలివచ్చి నివాళులు అర్పించారు. తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కెరీర్‌లో ఒడిదుడుకులు ఎదురైతే ప్రతినాయకుడిగా ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. ఇంతలోనే ఇలా అకాలమరణం చెందడం అందరి హృదయాల్నీ కలచివేస్తోంది.