
దివంగత నటి శ్రీదేవి.. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రానికి సంబంధించి తనపై వచ్చిన వివాదాస్పద ఆరోపణలపై అప్పట్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పూర్తి క్లారిటీ ఇచ్చారు. అవన్నీ అసత్య ఆరోపణలను ఖండించారు. బాహుబలిలో శివగామి పాత్రకు గాను తాను 8 కోట్ల పారితోషికం, ఒక మొత్తం ఫ్లోర్ బుకింగ్, 10 విమాన టికెట్లు వంటి భారీ డిమాండ్లు చేశానన్న వార్తలను శ్రీదేవి పూర్తిగా తోసిపుచ్చారు.
తన 50 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 300కు పైగా చిత్రాల్లో నటించానని, అలాంటి అన్యాయమైన డిమాండ్లు చేసి ఉంటే ఇన్నేళ్లు సినీ రంగంలో కొనసాగడం అసాధ్యమని ఆమె తెలిపారు. “ఎప్పుడో నన్ను ప్యాక్ చేసి పంపించేసేవాళ్లు” అని ఆమె నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 24 చిత్రాలు, అలాగే అశ్వినీదత్ వంటి ప్రముఖ నిర్మాతల చిత్రాల్లో తాను పదేపదే అవకాశాలు పొందానని, తన వృత్తి నైపుణ్యం, క్రమశిక్షణే దీనికి నిదర్శనమని ఆమె గుర్తు చేశారు.
తాను చాలాకాలం మౌనంగా ఉన్నప్పటికీ, రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తన గురించి మాట్లాడిన వీడియో లింక్‌ను ఒక శ్రేయోభిలాషి ద్వారా చూసిన తర్వాత తాను షాక్‌కు గురయ్యానని, చాలా బాధపడ్డానని శ్రీదేవి వెల్లడించారు. “ఆయన చాలా కామ్, చాలా డిగ్నిఫైడ్ దర్శకులు అని విన్నాను. ఆయన తీసిన ‘ఈగ’ చిత్రం నాకు చాలా నచ్చింది. అలాంటి వ్యక్తి ఇలా మాట్లాడటం నాకు చాలా బాధాకరమైన విషయం అనిపించింది. ఒక పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో ఇలా మాట్లాడకూడదు” అని ఆమె అభిప్రాయపడ్డారు. తనను తప్పుగా చూపించే ప్రయత్నం జరిగిందా లేదా తప్పుగా అర్థం చేసుకున్నారా అనేది తనకు తెలియదని, అయితే ఇలాంటి విషయాలను బహిరంగంగా చర్చించడం “నాట్ ఇన్ గుడ్ టేస్ట్” అని ఆమె స్పష్టం చేశారు.
ఆమె భర్త బోనీ కపూర్ స్వయంగా ఒక నిర్మాత కావడంతో, ఆయనకు నిర్మాణంలో ఉండే కష్టనష్టాలు పూర్తిగా తెలుసునని, కాబట్టి అలాంటి డిమాండ్లను ఆయన కూడా అంగీకరించి ఉండేవారు కాదని శ్రీదేవి చెప్పారు. తనపై వచ్చిన ఈ ఆరోపణలన్నీ “నాట్ ఫెయిర్” అని ఆమె పేర్కొన్నారు. చివరగా, బాహుబలి వంటి గొప్ప చిత్రాలను ఇంకా తీయాలని రాజమౌళికి, చిత్ర బృందానికి ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఆమె వివరణ విన్న తర్వాత ఇది శ్రీదేవికి, రాజమౌళికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఏర్పడిన ఒక ఇష్యూ అయి ఉండవచ్చని చాలామంది అభిప్రాయపడ్డారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.