
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది సోనాలి బింద్రే. స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమె తన అందం, అభినయంతో ఇక్కడి ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. ఒక్క తెలుగులోనే కాదు హిందీ, తమిళ్, కన్నడ, మరాఠి సినిమాల్లోనూ మెరిసిందీ అందాల తార. మహేష్ బాబు నటించిన మురారి సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఇంద్ర, ఖడ్గం, మన్మథుడు, పల్నాటి బ్రహ్మనాయుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కథానాయికగా నటించి మెప్పించింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుందీ అందాల తార. ఇక హిందీలో అయితే సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అయితే సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే క్యాన్సర్ మహమ్మారి బారిన పడింది సోనాలి. 2018లో మెటస్టాటిక్ క్యాన్సర్ స్టేజ్ 4లో ఉన్నట్లుగా నిర్ధారణ అయిందని తెలిపింది. దీంతో వెంటనే న్యూయార్క్ వెళ్లి చికిత్స తీసుకుందీ అందాల తార. ఇ్ కీమోథెరపీ సమయంలో తీసిన ఫోటోలను, గుండు చేయించుకున్న వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది సోనాలి. తద్వారా తనలాంటి ఎంతో మంది క్యాన్సర్ బాధితులకు ధైర్యాన్నిచ్చింది.
కాగా క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్న సోనాలి ఇప్పుడు మళ్లీ నటిగా బిజీ అయిపోయింది. వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ బిజి బిజీగా ఉంటోంది. కాగా సందర్భమొచ్చినప్పుడల్లా తన క్యాన్సర్ చికిత్స అనుభవాలను అందరితో పంచుకుంటోంది సోనాలి. ఇదే క్రమంలో కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ ముద్దుగుమ్మ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటోన్న సమయంలో తనకు ఓ స్టార్ హీరో పూర్తి మద్దతుగా నిలిచారని తెలిపింది.
‘ క్యాన్సర్ చికిత్స కోసం నేను అమెరికాలోని న్యూయార్క్ వెళ్లిపోయాను. ఆ సమయంలో నా ట్రీట్ మెంట్ గురించి సల్మాన్ ఖాన్ పదే పదే ఆరా తీశాడు. అంతే కాదు నేను చికిత్స పొందుతున్నప్పుడు పలు సార్లు న్యూయార్క్ వచ్చాడు. నాకు అత్యంత అవసరమైన సమయంలో హీరో సల్మాన్ ఖాన్ అండగా నిలిచాడు. అలాగే పలు సార్లు నా భర్తకు ఫోన్ చేసి అక్కడ సరైన వైద్యులు ఉన్నారో లేదో తెలుసుకున్నాడు. వారితో కూడా మాట్లాడాలని సల్మాన్ అడిగాడు’ అని సల్మాన్ పై ప్రశంసలు కురిపించింది సోనాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.