
నటి మీనా కుమారి ఈ పేరు చెప్తే పెద్దగా గుర్తుపట్టకపోవచ్చు కానీ.. ఆమెను చూస్తే టక్కున గుర్తుపట్టేస్తారు. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు మీనా కుమారి. సినిమాల్లో మెప్పించిన మీనా కుమారి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఫ్యామిలీతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు మీనా కుమారి. చాలా కాలం తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు మీనా కుమారి. ఈ ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి పంచుకున్నారు. ఆమె తన కొడుకు వైద్యుడని, అతని భార్య కూడా వైద్యురాలని తెలిపారు. తన కొడుకుకు సినిమాలపై కొంత ఆసక్తి ఉందని పేర్కొన్నారు. 1997లో విడుదలైన హిట్లర్ సినిమా గురించి అలాగే మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
అలాగే మీనా కుమారి మాట్లాడుతూ.. 1997లో మెగాస్టార్ చిరంజీవి నటించిన హిట్లర్ సినిమాలో తాను పలికిన ఒక డైలాగ్ తీవ్ర వివాదాన్ని సృష్టించిందని ఆమె చెప్పారు. చిత్రంలో ఆమె చిరంజీవి పాత్రను ఉద్దేశించి.. నిన్ను చూస్తుంటే నాకు రాక్షసుడిలా ఉన్నావు అని చెప్పిన డైలాగ్, సినిమా విడుదలైన తర్వాత అభిమానులను తీవ్రంగా కలవరపరిచిందని వివరించారు. ఈ సంఘటన తర్వాత తాను ఎక్కడికి వెళ్ళినా చిరంజీవి అభిమానులు తనను నిలదీయడం మొదలుపెట్టారని అన్నారు. ఒకానొక సందర్భంలో ఒంగోలులో జరిగిన హిట్లర్ 50 రోజుల వేడుకకు వెళ్తుండగా, దాదాపు 50 మంది అభిమానులు తన కారును అడ్డుకున్నారని మీనా కుమారి గుర్తు చేసుకున్నారు. మా హీరోని రాక్షసుడు అంటావా? దిగు కిందకు అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిపారు. అభిమానుల ప్రేమ మరియు కోపాన్ని చూసి తాను ఆశ్చర్యపోయానని, అది సినిమా అనీ, కేవలం డైలాగ్ మాత్రమే అని వివరించి, వారిని శాంతింపజేయాల్సి వచ్చిందని చెప్పారు.
ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి పాత్రలు చేయాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. మంచి కథలు, పాత్రలు వస్తే తిరిగి నటించడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే చెన్నైలో ఉండటం వల్ల, లేదా మేనేజర్‌లు అందుబాటులో లేకపోవడం వల్ల అవకాశాలు రావడం లేదని ఆమె అన్నారు. చిరంజీవిని తన ఆల్-టైమ్ ఫేవరెట్ హీరోగా మీనా కుమారి చెప్పుకొచ్చారు. చిరంజీవిని చూసినప్పుడు తనకు అన్నయ్యను చూసిన భావన కలుగుతుందని, అది తన గుండె లోతుల్లోంచి వచ్చే ఒక ఎమోషన్ అని అన్నారు. మిగతా హీరోలతో కేవలం సినిమా పరంగానే అనుబంధం ఉండేదని, కానీ చిరంజీవితో ఒక ప్రత్యేకమైన బంధం ఏర్పడిందని తెలిపారు మీనా కుమారి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.