
ఒకానొక సమయంలో తన అందంతో ప్రేక్షుకులను ఆకట్టుకుంది ముద్దుగుమ్మ లయ. స్వయంవరం సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన లయ ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది. చాలామంది హీరోయిన్లు గ్లామరస్ రోల్స్ తో మెప్పిస్తే ఈ అందాల తార మాత్రం హోమ్లీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో తెలుగు వారికి చేరువైంది. ఆ తర్వాత మా బాలాజీ, మనోహరం, మనసున్న మారాజు, కోదండ రాముడు, దేవుళ్లు, రామా చిలుకమ్మ, హనుమాన్ జంక్షన్, ప్రేమించు, శివరామరాజు, నీ ప్రేమకై, మిస్సమ్మ, స్వరాభిషేకం, అదిరిందయ్యా చంద్రం తదితర హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఆతర్వాత సినిమాలకు దూరం అయిన ఈ ముద్దుగుమ్మ ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్నారు లయ.
తాజాగా ఓ ఇంటర్వ్యూ లో లయ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. లయ మాట్లాడుతూ.. రాఘవేంద్రరావు నిర్వహించిన జెమినీ టీవీ స్టార్ 2000 కంటెస్ట్ ద్వారా తాను ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు. ఆ పోటీలో శివాజీ కూడా పాల్గొన్నారని, అప్పటి నుంచే తమకు పరిచయం ఉందని పేర్కొన్నారు. శివాజీతో కలిసి మిస్సమ్మ, అదిరిందయ్యా చంద్రం. టాటా బిర్లా మధ్యలో లైలా వంటి అనేక చిత్రాలలో నటించి, ప్రేక్షకుల మన్ననలు పొందామని, తాము భార్యాభర్తల పాత్రలకు బాగా సెట్ అయ్యామని చెప్పారు లయ. శివాజీతో పనిచేయడం చాలా సులువుగా ఉండేదని, ఆయన తన నటనకు స్వేచ్ఛ ఇచ్చేవారని లయ గుర్తుచేసుకున్నారు.
అలాగే నందమూరి బాలకృష్ణతో విజయేంద్ర వర్మ చిత్రంలో పనిచేసిన అనుభవాలను ఆమె పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. బాలకృష్ణను బయట చూసినప్పుడు లేదా ఆయన గురించి విన్నప్పుడు చాలా కోపంగా ఉంటారని, జాగ్రత్తగా మాట్లాడాలని ఒక అభిప్రాయం ఉండేదని లయ అన్నారు. కానీ బాలకృష్ణ చాలా ఆప్యాయంగా, చిన్నపిల్లల మనస్తత్వంతో, అత్యంత డౌన్-టు-ఎర్త్ వ్యక్తిగా ఉంటారని లయ పేర్కొన్నారు. విజయేంద్ర వర్మ సినిమా పాట చిత్రీకరణ సమయంలో జరిగిన ఒక సంఘటనను లయ గుర్తుచేసుకున్నారు. డాన్స్ స్టెప్స్ ప్రాక్టీస్ చేస్తుండగా, ఆమె పొరపాటున బాలకృష్ణ కాలు తొక్కినప్పుడు, ఆయననా కాలు తక్కుతావా.? ప్యాకప్.. ఈ అమ్మాయిని తీసేయండి అని సీరియస్ అయ్యారు. దాంతో నాకు ఏడుపొచ్చేసింది.. అక్కడి నుంచి వెళ్ళిపోయా.. దాంతో బాలకృష్ణగారు అయ్యో ఆ అమ్మాయి ఏడ్చేస్తుంది.. వెళ్లి ఆమెను ఆపేయండి.. నేనేదో సరదాగా అన్నాను నిజమనుకున్నావా.? ఇలాంటివి నేను బోలేడంటాను అని నవ్వేశారు. ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్‌తో బాలకృష్ణ తోటి నటులను సులువుగా మార్చేస్తారని ఆమె అన్నారు. డాన్స్ సన్నివేశాల్లో కూడా తనను చాలా ప్రోత్సహించేవారని, “నువ్వు నాకంటే బాగా చేస్తున్నావు” అని సరదాగా అనేవారని లయ గుర్తుచేసుకున్నారు. ఆఫ్-స్క్రీన్‌లో బాలకృష్ణ చాలా జోవియల్‌గా ఉంటారని లయ చెప్పారు. ఆయన పక్కన కూర్చుని మాట్లాడితే, ఎన్టీఆర్ గారిని చూసినట్లే అనిపిస్తుందని తెలిపారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..