RIP Vivek: మరో నవ్వుల రారాజును కోల్పోయిన వెండితెర.. 35 ఏళ్లకు పైగా సినిమానే జీవితంగా బ్రతికిన కామెడీ కింగ్

|

Apr 18, 2021 | 10:10 AM

వెండితెర మరో నవ్వుల రారాజును కోల్పోయింది. మూడు దశాబ్దలకు పైగా తన టాలెంట్‌తో వెండితెరను సుసంపన్నం చేసిన కామెడీ ఆర్టిస్ట్‌ వివేక్‌ గుండెపోటుతో తుది శ్వాస విడిచారు.

RIP Vivek: మరో నవ్వుల రారాజును కోల్పోయిన వెండితెర.. 35 ఏళ్లకు పైగా సినిమానే జీవితంగా బ్రతికిన కామెడీ కింగ్
Actor Vivek
Follow us on

వెండితెర మరో నవ్వుల రారాజును కోల్పోయింది. మూడు దశాబ్దలకు పైగా తన టాలెంట్‌తో వెండితెరను సుసంపన్నం చేసిన కామెడీ ఆర్టిస్ట్‌ వివేక్‌ గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో తమిళ సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది.  కామెడీ క్యారెక్టర్స్ చేసే ఆర్టిస్ట్‌లు చాలామంది ఉంటారు. తమ నటనతో కామెడీకే కొత్త అందం తీసుకువచ్చే స్థాయి నటులు మాత్రం చాలా రేర్‌. అలాంటి ఓ అరుదైన నటుడే వివేక్‌. 35 ఏళ్లకు పైగా తన కామెడీతో వెండితెరను ఏలిన కోలీవుడ్‌ కామెడీ కింగ్‌.. ఇంకెవరికీ సాధ్యం కానన్ని డిఫరెంట్ వేరియేషన్స్ తో ఆడియన్స్‌ను అలరించారు.

తమిళ సినిమాల్లో కామెడీ అంటే సెంథిల్, గౌండ్రమణి మాత్రమే అనుకుంటున్న రోజుల్లో వెండితెర అరంగేట్రం చేశారు నటుడు వివేక్‌. 1987లో రిలీజ్ అయిన మనతిన్‌ ఉరుది వేన్‌డుమ్‌ సినిమాతో తొలిసారిగా తన నవ్వుల ప్రయాణాన్ని ప్రారంభించారు. కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌ లాంటి టాప్ స్టార్స్‌ను పరిచయం చేసిన దిగ్గజ దర్శకుడు కే బాలచందర్ సినిమాతోనే వెండితెరకు పరిచయం అయ్యారు వివేక్‌. కామెడీ అంటే ద్వంద్వార్థాలు, హేళన మాత్రమే అనుకుంటున్న టైంలో తనదైన వేరియేషన్స్‌తో కామెడీ కలరే మార్చేశారు వివేక్‌. తెరపై ఆరోగ్యకరమైన కామెడీకి కొత్త దారులు చూపించారు. ఆయన కమెడియన్‌గా వరుస సినిమాలు చేస్తున్న సమయంలో వడివేలు, సంతానం లాంటి కమెడియన్స్ కూడా ఎంట్రీ ఇచ్చారు. కానీ ఎవరు వచ్చినా వివేక్‌ మాత్రం తన స్థానాన్ని అలాగే నిలబెట్టుకోగలిగారు.

కామెడీ అంటే సపోర్టింగ్ ట్రాక్ మాత్రమే అన్న ఆలోచనలను చెరిపేసి.. హాస్యాన్ని మెయిన్‌ ట్రాక్ ఎక్కించిన గొప్ప నటుడు వివేక్‌. స్టార్ హీరోల సినిమాల్లో కామెడీ పార్టనర్‌గా ఆయన చేసినన్ని పాత్రలు మరే నటుడూ చెయ్యలేదనటం అతిశయోక్తి కాదు. రజనీకాంత్-కమల్‌ హాసన్‌ లాంటి టాప్‌ స్టార్స్ నుంచి అజిత్, విజయ్‌ లాంటి స్టార్‌ హీరోల వరకు దాదాపు తమిళ హీరోలందరితోనూ కలిసి నటించారు వివేక్‌. తమిళ నటులు అంత అందంగా ఉండరన్న అపవాదు గట్టిగా వినిపిస్తున్న టైంలో వెండితెర మీద అందాల నటుడి ఇమేజ్‌ను సొంతం చేసుకున్న గ్లామర్‌ స్టార్ వివేక్‌. వివేక్‌ గ్లామర్‌కు ఫిదా అయిన కొంతమంది దర్శక నిర్మాతలు ఆయనకు హీరోగానూ ఆఫర్లు ఇచ్చారు. అయితే కామెడీ ట్రాక్‌లకే మోర్ ప్రయారిటీ ఇస్తూ వచ్చారు.

పేరుకు కమెడియనే అయినా.. ఆయన ఫాలోయింగ్ స్టార్ హీరోల రేంజ్‌లో ఉండేది. కేవలం వివేక్ కామెడీతోనే సూపర్ హిట్ అయిన సినిమాలు కూడా తమిళ్‌లో చాలా ఉన్నాయి. అంతేకాదు స్టార్ హీరోలు కూడా తమ సినిమాల్లో వివేక్‌ ఉంటే… కమర్షియల్‌గా ప్లస్ అవుతుంది అనుకునే రేంజ్‌లో తమిళ నాట ఫాలోయింగ్ సంపాందించుకున్నారు ఈ కామెడీ కింగ్‌. నటుడిగా ఎన్ని వేరియేషన్స్‌ చూపించినా.. ఏ రోజు ఆయన గీత దాటలేదు. కామెడీ పడించటం కోసం డబుల్‌ మీనింగ్ డైలాగ్‌లు, బాడీ షేమింగ్‌ లాంటివి ఎప్పుడూ చేయలేదు వివేక్‌. అందుకే ఆయన సినిమాలో ఉన్నారంటే కుటుంబ సమేతంగా చూడొచ్చు అన్న నమ్మకం తమిళ ఆడియన్స్‌లో కనిపించేది.

తమిళనాడు సెక్రటేరియట్‌లో ఉద్యోగిగా.. మంచి జీతం సెటిల్డ్ లైఫ్‌ ఉన్నా… అవన్ని కాదనుకొని సినీ రంగంలోకి అడుగుపెట్టారు వివేక్‌. మద్రాస్ హ్యుమర్ క్లబ్‌లో ప్రదర్శనలు ఇస్తున్న సమయంలో ఆయన కామెడీ టైమింగ్స్‌.. ఎక్స్‌ప్రెషన్స్‌ చూసి… సినిమా అవకాశం ఇచ్చారు దర్శకుడు బాలచందర్‌. ఇండస్ట్రీలో నటుడిగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో బుల్లితెర అవకాశాలు వచ్చినా కాదనకుండా చేశారు. టాప్‌ టక్కర్ అనే టీవీ షోలో కామెడీ రోల్‌లో నటించిన వివేక్‌.. ప్రతీ తమిళ ప్రేక్షకుడికి దగ్గరయ్యారు. సోషల్ యాక్టివిస్ట్‌గానూ పేరు తెచ్చుకున్నారు వివేక్‌. కామెడీ క్యారెక్టరే అయినా అందులోనూ ఎంతో కొంత మెసేజ్‌ ఇచ్చే ప్రయత్నం చేసేవారు. ఈ ఆలోచనే ఆయన్న దర్శకుడు శంకర్‌కు దగ్గర చేసింది. తన ప్రతీ సినిమాలోనూ వివేక్‌కు ఓ ఇంపార్టెంట్‌ క్యారెక్ట్ ఇచ్చేవారు శంకర్‌.

కమెడియన్‌గా ఫుల్‌ ఫాంలో ఉన్న టైంలో ఓ డిఫరెంట్ స్టైల్‌ను ఫాలో అయ్యేవారు వివేక్‌. సినిమాల్లో తన ట్రాక్‌ను స్పెషల్‌గా ఓ రైటర్‌తో రాయించుకునేవారట. అలా ఆయన సృష్టించిన సన్నివేశాలు ఎన్నో సినిమాల్లో అద్భుతంగా పండాయి. స్మాల్ స్క్రీన్‌ మీద ఎంతో మంది ప్రముఖులను ఇంటర్వ్యూ చేశారు వివేక్. ముఖ్యంగా దివంగత రాష్ట్రపతి, మిసైల్‌ మ్యాన్ ఏపీజే అబ్దుల్‌ కలాంతో వివేక్‌ చేసిన ఇంటర్వ్యూ ఆయన జీవితంలో వచ్చిన ఓ అద్భుత అవకాశంగా చెప్పుకునే వారు వివేక్‌. వెండితెర మీద నవ్వులు పూయించిన వివేక్‌ జీవితంలో అంతులేని విషాదం కూడా ఉంది. 5 ఏళ్ల క్రితం వివేక్‌ కొడుకు ప్రసన్న కుమార్ అర్ధాంతరంగా తనువు చాలించారు. 13 ఏళ్ల వయసులోనే కొడుకు డెంగ్యూతో చనిపోవటం వివేక్‌ను మానసికంగా కుంగదీసింది. అంత విషాదాన్ని మనసుల్లోనే దాచుకొని ఆ తరువాత కూడా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించారు.

కళకు అవధులు, అంతరాలు వుండవంటారు. ఆ కళలో కామెడీ కళకయితే.. ఆకాశమే హద్దు. అందుకే… కోలీవుడ్‌ కమెడియన్ వివేక్ లేరన్న వార్తకు.. టాలీవుడ్‌ కూడా షాకయింది. వివేక్ లాంటి కమెడియన్ మరొకరు పుట్టరంటూ నివాళులర్పిస్తోంది తెలుగు పరిశ్రమ. కామెడీ పండాలంటే.. టైమింగ్ ముఖ్యం.. కరెక్ట్‌గా పడాల్సిన టైమ్‌లో పడాల్సిన మూమెంట్‌లో పడితేనే ఆ పంచ్ పేలేది. ఈ టాలెంట్‌లో తిరుగులేదనిపించుకున్నారు తమిళ్‌స్టార్ కమెడియన్ వివేక్. ఎందరో తెలుగు కమెడియన్లక్కూడా స్పూర్తిగా మారారు మిస్టర్ వివేకానందన్.

డబ్బింగ్‌ సినిమాల ఒరవడి పెరిగిన టైమ్‌లో.. తమిళ్ స్టార్‌ హీరోలకు దీటుగా తెలుగులో ఫాలోయింగ్ తెచ్చుకున్నారు కమెడియన్‌ వివేక్. రజనీ కమల్‌ లాంటి హీరోల సినిమాల కోసం వెయిట్ చేసినట్టే.. ఆ సినిమాల్లో వివేక్ సీన్స్ కోసం వెయిట్ చేయడం టాలీవుడ్ ఆడియన్స్‌కి అలవాటు.
ఆయన సినిమాలకు తెలుగులో డబ్బింగ్ చెప్పడాన్ని ఇష్టంగా భావించే తెలుగు ఆర్టిస్టులు అనేకమంది. మీ కామెడీ పంచుల్ని చూస్తూ ఎంజాయ్‌ చేస్తూ పెరిగాం అంటూ టాలీవుడ్ ప్రముఖులంతా వివేక్ మేజిక్‌ ఆఫ్‌ కామెడీని రీకాల్ చేసుకుంటున్నారు. వివేక్‌ మరణం తమిళ ఇండస్ట్రీకి మాత్రమే కాదే భారతీయ సినీ పరిశ్రమకే తీరని లోటు. అందుకే ప్రధాని మోడీ నుంచి సామాన్య ప్రేక్షకుడి వరకు ప్రతీ ఒక్కరు ఈ మహానటుడికి అంజలి ఘటిస్తున్నారు.

Also Read: ‘అల..వైకుంఠపురములో’ సునామి ఇప్పట్లో ఆగేలా లేదు.. తాజాగా మరో క్రేజీ రికార్డ్

‘రాధే శ్యామ్’ సినిమా స్టోరీ ఇదేనా.. సోషల్ మీడియాలో ఇంట్రస్టింగ్ లైన్ వైరల్