
నటుడు శివాజీ రాజా, ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి గురించి అలాగే తన సినీ అనుభవాల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ఖడ్గం చిత్రం గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఖడ్గంలో ఆర్మీ ఆఫీసర్ పాత్ర కోసం కృష్ణవంశీ తనను సంప్రదించినప్పుడు, తొలుత ఆ పాత్రను తిరస్కరించినట్లు తెలిపారు. గతంలో కృష్ణవంశీ చిత్రాలలో ప్రధాన పాత్రలు పోషించిన తాను, ఒకరోజు కాల్ షీట్‌తో కూడిన చిన్న పాత్రను చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నానని చెప్పారు. అయితే, కృష్ణవంశీ పట్టుబట్టడంతో, కేవలం ఆయనపై ఉన్న గౌరవంతోనే ఆ పాత్రను అంగీకరించినట్లు వివరించారు. సెట్‌లో ప్రకాష్ రాజ్, రవితేజ, శ్రీకాంత్ వంటి వారితో కలిసి సరదాగా గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఒక సీరియస్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో తాము జోకులు వేసుకుంటూ నవ్వుతుంటే, కృష్ణవంశీ కోపంతో “సైలెన్స్” అని అరిచారని, ఆ సన్నివేశాన్ని కేవలం ఒకటే టేక్‌లో పూర్తి చేశారని శివాజీ రాజా తెలిపారు. ఖడ్గం చిత్రం నుంచి తాను చెప్పిన “శాంతి శాంతి” డైలాగ్ సర్జికల్ స్ట్రైక్స్ వంటి సందర్భాలలో దేశమంతా గుర్తు చేసుకునే స్థాయికి చేరిందని, ఆ క్రెడిట్ కృష్ణవంశీకే దక్కుతుందని ఆయన అన్నారు.
అంతేకాకుండా, ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న అమృతం సీరియల్ నుంచి తాను నిష్క్రమించడానికి గల కారణాలను శివాజీ రాజా వివరించారు. తన తప్పు లేదని, అలాగే ఆ టీం తప్పు కూడా కాదని స్పష్టం చేశారు. ఒక హిట్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు తలెత్తే ఈగో ప్రాబ్లమ్స్, అపార్ధాలే దీనికి కారణమని వివరించారు. తాను వేరే సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్ల డబ్బింగ్ చెప్పడానికి ఆలస్యం అయిన సందర్భాలు ఉన్నాయని, ఆ సమయంలో కొన్ని ప్రమోషనల్ వీడియోల ద్వారా వివాదాలు తలెత్తాయని చెప్పారు. అప్పటి వయసు, అనుభవం లేమి వల్ల జరిగిన పొరపాట్లు తప్ప, ఎవరినీ ఉద్దేశించి కాదని అన్నారు. అమృతం దర్శకుడు గంగరాజు పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని, ఆ సీరియల్ విజయానికి ఆయనదే ముఖ్య కారణమని పేర్కొన్నారు.
తాను సీరియల్ నుండి బయటకు వచ్చాక మళ్ళీ అమృతం చూడలేదని, ఇప్పటికీ అమెరికా వంటి దేశాలకు వెళ్ళినప్పుడు తెలుగువాళ్లు తనను అమృతం పాత్రతో గుర్తు పట్టడం ఆనందంగా ఉంటుందని తెలిపారు. ఇక దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ప్రతిభపై శివాజీ రాజా ప్రశంసలు కురిపించారు. ఆయన స్క్రీన్ ప్లే అద్భుతమని, అమృతం సీరియల్‌కు ఆయన రాసిన 13 ఎపిసోడ్‌లు వేరే స్థాయికి తీసుకెళ్ళాయని అన్నారు. అనుకోకుండా ఒక రోజు, సాహసం వంటి చిత్రాలలో ఆయన దర్శకత్వ ప్రతిభ స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. తెలుగు సినిమాకు సిరివెన్నెల సీతారామశాస్త్రి ఎలాంటి వారో, చంద్రశేఖర్ యేలేటి కూడా అలాంటి అద్భుతమైన రచయిత అని పోల్చారు. ఆయనకు రావాల్సినంత గుర్తింపు రాకపోవడానికి కారణం, ఆయన నిదానంగా, పద్ధతిగా పని చేసే వ్యక్తిత్వం అని శివాజీ రాజా అభిప్రాయపడ్డారు. అదేవిదంగా సిరివెన్నెల సీతారామశాస్త్రిగారితో తనకున్న అనుబంధాన్ని శివాజీ రాజా భావోద్వేగంగా పంచుకున్నారు. ఆయనను తన సొంత తండ్రిగా భావిస్తానని, వారి మధ్య తండ్రి-కొడుకుల బంధం ఉండేదని అన్నారు. కళ్ళు సినిమా సమయంలో ఇద్దరూ వైజాగ్ బీచ్‌లో కలిసి నడిచిన రోజులు, రైలు ప్రయాణాలు, మద్రాసులో సాలిగ్రామం ఇంట్లో కలిసి గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. సిరివెన్నెలగారికి పద్మశ్రీ వచ్చినప్పుడు తాను స్వయంగా వెళ్లి అభినందించానని, అదే చివరి కలుసుకోవడం అయ్యిందని శివాజీ రాజా తెలిపారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి