Murali Mohan : పద్మ శ్రీ ఇచ్చేముందు నన్ను ఎలాంటి ప్రశ్నలు అడిగారంటే.. ఉదయాన్నే 6 గంటలకు ఫోన్ చేసి.. మురళి మోహన్..

సీనియర్ నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు మురళీమోహన్ ఇటీవలే పద్మ శ్రీ అవార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన పద్మశ్రీ అవార్డుపై తన అనుభవాలను పంచుకున్నారు. ఉదయం 6 గంటలకు హోమ్ డిపార్ట్‌మెంట్ నుండి వచ్చిన ఫోన్ కాల్, అవార్డు ఆలస్యంగా వచ్చిందని భావించకుండా "లేటెస్ట్ గా" వచ్చిందని ఆయన పేర్కొనడం, అవార్డు ప్రకటనకు ముందు ఎదుర్కొన్న మౌన ఆనందం గురించి చెప్పుకొచ్చారు.

Murali Mohan : పద్మ శ్రీ ఇచ్చేముందు నన్ను ఎలాంటి ప్రశ్నలు అడిగారంటే.. ఉదయాన్నే 6 గంటలకు ఫోన్ చేసి.. మురళి మోహన్..
Murali Mohan

Updated on: Jul 02, 2026 | 1:28 PM

సీనియర్ నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు, ఫిలాంథ్రపిస్ట్ , బిల్డర్‌గా బహుముఖ ప్రజ్ఞాశాలి మురళీమోహన్ కి పద్మశ్రీ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ అరుదైన గౌరవంపై తన అనుభవాలను, ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో మురళీమోహన్‌కు పద్మశ్రీ అవార్డు రావడం పట్ల చాలామంది ఇది ఆలస్యంగా వచ్చిన గౌరవం అని అన్నారు. అయితే, ఆయన ఈ అభిప్రాయంతో ఏకీభవించలేదు. “నేను అట్లా అనుకోవట్లేదు. 140 కోట్ల మంది జనాభాలో నేను ఒక నలుసుని. అలాంటి నలుసుని వాళ్ళు సెలెక్ట్ చేసి ఇచ్చారంటే అది గొప్ప విషయం. అందుకని నేను లేట్ గా వచ్చింది అనుకోవట్లేదు, లేటెస్ట్ గా వచ్చింది అనుకుంటున్నాను” అని ఆయన తెలిపారు. పద్మశ్రీ అవార్డు కోసం మురళీమోహన్ చేసిన ప్రయత్నాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. మొదటిసారి దరఖాస్తు చేసినప్పుడు, ఎంపీలకు పద్మ అవార్డులు ఇవ్వరని చెప్పడంతో ఆయన ప్రయత్నాన్ని విరమించుకున్నారు.

“అప్పుడు మీరు పొలిటీషియన్ గా ఉన్నారు కాబట్టి నాట్ ఎలిజిబుల్ అన్నారు” అని గుర్తు చేసుకున్నారు. తర్వాత ఒకసారి మళ్ళీ దరఖాస్తు చేసినప్పుడు, పోలీస్ విచారణ, కేవైసీ నివేదికలు వంటి ప్రక్రియలు అన్నీ పూర్తయ్యాయి. పోలీసుల నుండి ఆయనకు క్లీన్‌చిట్ వచ్చిందని, అవార్డు ఖచ్చితంగా వస్తుందని అభినందనలు కూడా అందాయి. కానీ అవార్డు రాలేదు. ఆ తర్వాత ఆయన నిరాశ చెంది, ఇక దరఖాస్తు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇక మూడోసారి స్నేహితుల ప్రోత్సాహంతో చివరి ప్రయత్నంగా దరఖాస్తు చేశారు. ఈసారి కూడా రాకపోతే అసలు ప్రయత్నించకూడదని అనుకున్నాని తెలిపారు. ఈసారి అనుకోని విధంగా శుభవార్త అందింది. ఒకరోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో వాకింగ్ చేస్తుండగా, ఆయనకు ఒక అపరిచిత నంబర్ నుండి ఫోన్ వచ్చింది. కాల్ ఎత్తకుండా జేబులో పెట్టేసుకున్న ఆయన, మళ్ళీ కాల్ రావడంతో ఎవరో అని మాట్లాడారు. అవతల ఉన్నవారు ఢిల్లీ హోమ్ డిపార్ట్‌మెంట్ నుండి మాట్లాడుతున్నామని, పద్మశ్రీ అవార్డు గ్రహీతల జాబితాలో ఆయన పేరు కూడా ఉందని తెలియజేశారు. అవార్డును స్వీకరించడానికి అంగీకరిస్తారా అని అడగ్గా, “అదేంటి సార్ ఆ మాట అన్నారు? ఎవరైనా వద్దా అంటారా?” అని ఆయన ఆశ్చర్యపోయారు. గతంలో కొందరు తమ అర్హతకు తగ్గట్టుగా లేదని లేదా ఆలస్యంగా ఇచ్చారని అవార్డులను తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయని, అందుకే నిర్ధారణ చేసుకుంటున్నామని అధికారులు వివరించారు.

అయితే, ప్రైమ్‌మినిస్టర్ పత్రికా సమావేశంలో అధికారికంగా ప్రకటించే వరకు ఈ విషయం ఎవరికీ వెల్లడించకూడదని అధికారులు మురళీమోహన్‌ను కోరారు. ఈ ఆదేశంతో ఆయన లోపల ఆనందంతో ఉప్పొంగినప్పటికీ, భార్యకు కూడా చెప్పలేకపోయారు. “మనసులో ఇంకో అనుమానం ఉంది. అసలు ఇది రియల్ కాలా ఫాల్స్ కాలా? అంత పొద్దున్నే ఎందుకు వచ్చింది?” అని ఆయన సందేహించారు. ఒకవేళ అది తప్పుడు కాల్ అయితే, కుటుంబ సభ్యులకు చెప్పి, తర్వాత అది జరగకపోతే నిరాశ చెందడం, తను సిగ్గుపడటం వంటివి జరుగుతాయని భావించి మౌనంగా ఉండిపోయారు.

ఉదయం 8:30 గంటల ప్రాంతంలో సారధి స్టూడియో నుండి ఒక మేనేజర్ ఫోన్ చేసి “కంగ్రాట్యులేషన్స్” అని చెప్పడంతో, మురళీమోహన్ ఆశ్చర్యపోయారు. “దేనికి?” అని అడగ్గా, “మీకు పద్మ అవార్డు వచ్చింది కదా, టీవీలో న్యూస్‌లో వస్తుందండి” అని ఆ మేనేజర్ తెలియజేశారు. అప్పుడే మురళీమోహన్ తన భార్యను టీవీ ఆన్ చేయమని కోరగా, వార్త ప్రసారం అవుతోంది. వార్తను నిర్ధారించుకున్న వెంటనే, బయట ఉన్న తన కుమారుడు, కోడలు, కుమార్తెకు ఫోన్ చేసి రమ్మని చెప్పారు. వారు పూలగుత్తులతో ఇంటికి వచ్చి సంబరాలు చేసుకున్నట్లు గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత, అభినందన కాల్స్ వెల్లువలా వచ్చాయి. నిమిషానికో కాల్ వస్తుండటంతో ఆయన ఫోన్ పెట్టడానికి కూడా వీలు కాలేదు. రాత్రి 11, 12 గంటల వరకు ఫోన్లు మాట్లాడుతూనే ఉన్నానని, ఆ తర్వాత రోజు కూడా ఉదయం నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయని, దాంతో రెండు రోజుల పాటు ఉదయం వాకింగ్‌ను కూడా మానేశానని ఆయన సంతోషంగా వివరించారు.

Follow Us