
అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన ఘటన అందరినీ ఆందోళనకు గురి చేసింది. పట్ట పగలే క్లాస్ రూమ్‌లోనే టెన్త్ విద్యార్థినిపై దుండగుడు ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేయడంపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనలో తీవ్రం గాయపడ్డ విద్యార్థిని త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. అలాగే నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ దాడి ఘటనపై ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంత్రి నారా లోకేశ్, హోం మంత్రి అనిత తదితరులు స్పందించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం చేయాలని, అలాగే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక ఈ దాడి ఘటనపై సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. తాజాగా హీరో మంచు మనోజ్ ఈ దాడిపై స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు.
‘ఒక తండ్రిగా, రాప్తాడు పాఠశాలలో జరిగిన దాడి నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆ ఇద్దరు బాలికలు త్వరగా, పూర్తిగా కోలుకోవాలని, వారి కుటుంబాలకు మనోధైర్యం కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. తన స్నేహితురాలిని కాపాడటానికి ముందుకొచ్చిన ఆ బాలిక అసాధారణమైన ధైర్యాన్ని ప్రదర్శించింది. ప్రాణాలను కాపాడిన వైద్యులకు, అలాగే గ్రీన్ కారిడార్, మెరుగైన చికిత్స కోసం తరలింపును సమన్వయం చేసిన ఏపీ ప్రభుత్వానికి, పోలీసులు, వైద్య బృందాలకు కృతజ్ఞతలు. బాధిత విద్యార్థుల కోసం 20 మంది మానసిక ఆరోగ్య కౌన్సిలర్లను నియమించడం సంతోషంగా ఉంది. ఈ దుర్ఘటన వల్ల ప్రభావితమైన ప్రతి బిడ్డకు, ఉపాధ్యాయునికి కుటుంబానికి ఫుల్ సపోర్ట్ అందేలా దయచేసి చూడండి’.
‘ఇది కేవలం ఒక వ్యక్తికి, ఒక నేరానికి సంబంధించిన విషయం కాదు. ఇళ్లలో, సమాజంలో మహిళలను వస్తువులుగా చూసి, సరదాగానైనా, మామూలుగానైనా అగౌరవపరిచినప్పుడు, అది ప్రమాదకరమైన వైఖరులను సృష్టిస్తుంది. మహిళలను వస్తువులుగా చూడటం హానికరం. వేధింపులకు, హింసకు పరిణామాలు తప్పక ఉండాలి. రోజువారీ అగౌరవాన్ని గట్టిగా ఎదుర్కోవాలి. మహిళల పట్ల గౌరవం ఇంటి నుంచే మొదలవుతుంది. మనం కోరుకునే సమాజం, మన ఇళ్లల్లో, సమాజంలో మహిళలతో మనం ప్రవర్తించే తీరుతోనే మొదలవుతుంది. ఆ సురక్షితమైన సమాజాన్ని మనమందరం కలిసి నిర్మిద్దాం.’ అని ట్విట్టర్ వేదికగా పిలుపు నిచ్చాడు మనోజ్. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట బాగా వైరలవుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి