
ప్రముఖ సీనియర్ నటుడు చలపతిరావు హఠాన్మరణం చెందారు. శనివారం రాత్రి గుండెపోటుతో హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1200కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. అనేక సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి..ప్రేక్షకుల మదిపై చలపతిరావు చెరగని ముద్ర వేశారు. రెండు రోజుల క్రితమే సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతిచెందగా..ఇప్పుడు చలపతిరావు ఆకస్మిక మరణంతో టాలీవుడ్ చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. చలపతిరావుకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమారుడు రవిబాబు దర్శకుడు, నటుడు, నిర్మాతగా ఉన్నారు.
చలపతిరావు అసలు పేరు తమ్మారెడ్డి చలపతిరావు. 1944 మే 8న కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని బల్లిపర్రులో గ్రామంలో మణియ్య, వియ్యమ్మ దంపతులకు జన్మించారు. చిన్నప్పుడే నాటకాలపై ఆసక్తి పెంచుకుని, స్నేహితులతో కలిసి వాటిని ప్రదర్శించేవారు. దానివల్ల చదువు సరిగా సాగలేదు. బాగా ఒడ్డు, పొడుగు ఉండటం వల్ల నాటకాల్లో కథానాయకుడిగా నటించేవారు. వందలాది నాటకాలు వేసిన ఆయన, ఎన్టీఆర్ ప్రోత్సాహంతో సినిమా రంగంలోకి వచ్చారు. 1966లో గూడచారి 116 సినిమాతో ఆయన చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు. నటుడు, నిర్మాతగా చలపతిరావు గుర్తింపు పొందారు. కలియుగ కృష్ణుడు, కడప రెడ్డమ్మ, జగన్నాటకం, పెళ్లంటే నూరేళ్ల పంట, రాష్ట్రపతి గారి అల్లుడు తదితర సినిమాలకు చలపతిరావు నిర్మాతగా వ్యవహరించారు.
సీనియర్ ఎన్టీఆర్‌తో చలపతిరావుకు ప్రత్యేక అనుబంధం ఉంది. మూడు తరాల నటులతోనూ ఆయన నటించారు. యమగోల, యుగపురుషుడు,డ్రైవర్ రాముడు, భలే కృష్ణుడు,సరదా రాముడు,జస్టిస్ చౌదరి, బొబ్బిలి పులి, దొంగ రాముడు, అల్లరి అల్లుడు, నిన్నేపెళ్లాడతా, నువ్వేకావాలి, సింహాద్రి, బన్నీ, బొమ్మరిల్లు, అరుంధతి, సింహా, దమ్ము, లెజెండ్ ఇలా ఎన్నో వందల చిత్రాల్లో ఆయన కీలకపాత్రలు పోషించారు. గతేడాది విడుదలైన ‘బంగార్రాజు’ తర్వాత చలపతిరావు వెండితెరపై కనిపించలేదు.
టాలీవుడ్‌లో 90వ దశకంలో ఎక్కువ రేప్ సీన్‌లలో నటించింది చలపతిరావే. ఆయన 90కిపైగా రేప్ సీన్లలో కనిపించారు. ఈ ప్రభావంతో నిజ జీవితంలో ఈయన్ను చూసి ఆడవాళ్లు భయపడిన సందర్భాలూ ఉన్నాయి. ఆ తర్వాత చలపతిరావు విలన్ వేషాల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారాక కూడా మంచి పేరు వచ్చింది. నిన్నే పెళ్లాడతా లాంటివి కెరీర్‌లో తన ఇమేజ్‌ను మార్చాయి. ఆది, చెన్నకేశవరెడ్డి లాంటి సినిమాల్లో మంచి సపోర్టింగ్ క్యారెక్టర్స్‌తో తర్వాతి జనరేషన్‌కు కూడా దగ్గరయ్యారు. మొత్తానికి మరో సినీ దిగ్గజాన్ని కోల్పోయింది టాలీవుడ్.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.