హీరో అడివి శేష్ (Adivi Sesh) ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం మేజర్ (Major). 6/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు డైరెక్టర్ శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించిన ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే పలు నగరాల్లో మేజర్ ప్రివ్యూస్ షోలు ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇక సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఈ సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు హీరో అడివి శేష్..
మేజర్ సందీప్ బయోపిక్ చేయాలని ఎప్పుడు అనిపించింది అని అడగ్గా.. హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. ” 26/11 సంఘటనలు జరిగాక ఆయన ఫొటోలు బయటకు వచ్చాక మా కజిన్ పవన్ నాకూ సందీప్‌కు పోలికలు వున్నయని చెప్పాడు. వందలాది మంది ప్రాణాలు కాపాడిన ఆయనకు అశోక్ చక్ర వచ్చినప్పుడు ఆయన గురించి చదివి ఆయనకు ఫ్యాన్ అయ్యాను. ఆయన నిజజీవితంలో జరిగిన విషయాలు ఎవరికీ తెలీవు. హోటల్‌లో 36 గంటలు ఏం చేశాడనేది తెలుసు. కానీ 31 సంవత్సరాలలో ఆయన జీవితం ఎలా వుందనేది ఎవరికీ తెలీదు. ఇవన్నీ నేను తెలుసుకున్నాక ఆయన లైఫ్ గురించి ఎందుకు చెప్పకూడదనే ఆలోచన వచ్చింది. క్షణం సినిమా టైంలో ఆలోచన స్టార్ట్ అయింది. గూఢచారి టైంలో స్పీడ్ అందుకుంది” అని చెప్పుకొచ్చారు.
అలాగే.. సందీప్ గురించి లోతుగా తెలుసుకున్నాక షాకింగ్ కు గురయిన సంఘటన మీకు ఏమైనా వుందా? అని విలేకరి అడగ్గా.. ఓ సంఘటన వుందన్నారు అడివి శేష్. “ఇండియన్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకుని తిరిగి ట్రైన్‌లో ఇంటికి వెళుతుండగా సందీప్ ఫ్రెండ్‌కూడా వున్నాడు. తను అస్సాం వెళుతున్నాడు. సందీప్ బెంగుళూరు వెళ్లాలి. ఆ సమయంలో ఆయన ఫ్రెండ్ నా దగ్గర డబ్బులు లేవు అని అడగడంతో తన జేబులోని వున్న మొత్తం ఇచ్చేశాడు. ఆ తర్వాత సందీప్ బెంగుళూరు వచ్చేవరకు ప్రయాణంలో ఏమీ తినలేదు. తాగలేదు. మిలట్రీ మనిషి కాబట్టి ఎవరినీ ఏమీ అడగకూడదు అనే రూల్ వుంటుంది. కానీ ఇలాంటి సంఘటన చెబితే నమ్ముతారోలేదో అని పెట్టలేదు” అని తెలిపారు.