Tollywood: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. షోకాజ్ నోటీస్ ఇచ్చిన ఫెడరేషన్.. 7 రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే..

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గట్టి షాక్ ఇచ్చింది. ఫెడరేషన్ నియమ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేయడమే కాకుండా.. తక్షణమే సహాయ నిరాకరణ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Tollywood: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. షోకాజ్ నోటీస్ ఇచ్చిన ఫెడరేషన్.. 7 రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే..
Tollywood Dance Association Dispute 1
Image Credit source: AI Image

Updated on: Jul 17, 2026 | 7:32 PM

ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఫెడరేషన్ నియమ నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు ఫెడరేషన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే తీవ్ర ఆరోపణలపై ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా ఆయనపై తక్షణమే సహాయ నిరాకరణ విధిస్తున్నట్లు ఫెడరేషన్ సంచలన ప్రకటన చేసింది. ఈ నెల 12న జానీ మాస్టర్ విడుదల చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపింది. తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ కార్యాలయం ఎదుట ఆయన చేసిన వ్యాఖ్యలు, సభ్యులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం, ఫెడరేషన్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించడం వంటి చర్యలపై ఫెడరేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారనే అంశంపై కూడా ఫెడరేషన్ సీరియస్ అయ్యింది. జానీ మాస్టర్ చేసిన ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఫెడరేషన్.. ఈ నెల 14న ఆయనను వివరణ కోసం ఆఫీస్ సమావేశానికి పిలిచింది. అయితే విచారణకు పిలిచినా ఆయన హాజరుకాకపోగా తన ఇష్టానుసారంగా మాట్లాడటం కొనసాగించారని ఫెడరేషన్ వర్గాలు తెలిపాయి.

జనరల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో కీలక నిర్ణయం..

ఈ వివాదంపై ఈ నెల 16న తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జనరల్ కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. జానీ మాస్టర్ ప్రవర్తనను తీవ్ర క్రమశిక్షణా ఉల్లంఘనగా భావించిన కౌన్సిల్, ఆయనపై సహాయ నిరాకరణ చర్యలు ప్రారంభించాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆ తర్వాత 17న మధ్యాహ్నం 12:35 గంటలకు ఫెడరేషన్ కార్యాలయంలో మరోసారి సమావేశమై ఈ నిర్ణయాన్ని అధికారికంగా ఖరారు చేశారు.

7 రోజుల్లో వివరణ ఇవ్వాలి.. లేదంటే..

షోకాజ్ నోటీసు అందిన 7 రోజులలోపు జానీ మాస్టర్ దీనిపై లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఫెడరేషన్ ఆదేశించింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా సంతృప్తికరమైన వివరణ ఇవ్వకపోయినా, లేదా బహిరంగ క్షమాపణలు చెప్పకపోయినా ఆయనపై మరిన్ని కఠిన క్రమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అలాగే ఆదివారం జరగబోయే ఫెడరేషన్ జనరల్ బాడీ మీటింగ్‌లో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

24 క్రాఫ్ట్‌లకూ ఆదేశాలు..

ఫెడరేషన్ తీసుకున్న సహాయ నిరాకరణ నిర్ణయం కారణంగా.. ఇకపై ఫెడరేషన్‌కు అనుబంధంగా ఉన్న అన్ని సంఘాలు, సభ్యులు, కార్మికులు జానీ మాస్టర్‌తో పాటు తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌కు ఎలాంటి అధికారిక సహకారం అందించకూడదని స్పష్టం చేశారు. ఫెడరేషన్‌కు అనుబంధంగా ఉన్న 24 క్రాఫ్ట్ సంఘాలూ ఈ నిర్ణయాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. ఫెడరేషన్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయంతో టాలీవుడ్ డ్యాన్స్ అసోసియేషన్‌లో తీవ్ర అలజడి రేగుతోంది. ఈ నోటీసులపై జానీ మాస్టర్ ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు పరిశ్రమలో ఆసక్తికరంగా మారింది.

Follow Us