గోవా వెళ్తే ఈ ఫుడ్స్ తప్పకుండా టేస్ట్ చేయాలట.. ఫుడ్ కల్చర్‌‌పై సమీరారెడ్డి వీడియో వైరల్

మాజీ నటి సమీరా రెడ్డి తన గ్లామర్ ప్రపంచాన్ని వదిలి గోవాలోని ప్రశాంతమైన జీవన శైలికి అలవాటు పడి పోయారు. అక్కడ ప్రకృతి ఒడిలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ, స్థానిక సంప్రదాయాలను గౌరవిస్తూ ఆమె గడుపుతున్న తీరు అభిమానుల మనసు గెలుచుకుంటోంది.

గోవా వెళ్తే ఈ ఫుడ్స్ తప్పకుండా టేస్ట్ చేయాలట.. ఫుడ్ కల్చర్‌‌పై సమీరారెడ్డి వీడియో వైరల్
Goan Pao Varieties By Sameera Reddy.jpg

Updated on: Mar 30, 2026 | 7:00 AM

సమీరా రెడ్డి గోవాలోని అత్యంత ప్రాచుర్యం పొందిన ‘పావ్’ రకాల గురించి ఒక ఆసక్తికరమైన వీడియోను పంచుకున్నారు. గోవా సంస్కృతిలో అంతర్భాగమైన ఈ రొట్టెలు కేవలం ఆహారం మాత్రమే కాదు, అక్కడి ప్రజల జీవనశైలికి నిదర్శనం అని ఆమె వివరిస్తున్న విశేషాలు ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

గోవాలో దొరికే రొట్టెలను సంప్రదాయబద్ధంగా కట్టెల పొయ్యిపై తయారు చేస్తారు. ఒక్కో రకమైన పావ్ ఒక్కో ప్రత్యేకమైన ఆకృతిని, రుచిని కలిగి ఉంటుంది. సమీరా తన స్నేహితుడు డైలాన్ డిసౌజాతో కలిసి గోవాలో లభించే ఏడు రకాల ముఖ్యమైన పావ్ వెరైటీలను పరిచయం చేశారు.

గోవా స్పెషల్ 7 రకాల పావ్ వెరైటీలు

  1. రేవ్డా (Revda): ఇది మెత్తగా ఉండే తెల్లని బ్రెడ్ రోల్. దీని ఆకారం నత్తను పోలి ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది.
  2. కడక్ పావ్ (Kadak Pao): దీనిని స్థానికంగా ‘ఉండో’ అని కూడా పిలుస్తారు. ఇది పైన చాలా గట్టిగా, లోపల దట్టంగా ఉంటుంది. ఘాటైన కూరలతో తింటే ఇది అద్భుతంగా ఉంటుంది.
  3. కత్రే పావ్ (Katrae Pao): ఇది చూడటానికి సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. దీనిని తయారు చేసేటప్పుడు కత్తెరతో రెండు వైపులా కట్ చేయడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది.
  4. లాడీ పావ్ (Ladi Pao): మనకు సాధారణంగా దొరికే బ్రెడ్ రోల్స్ క్లస్టర్ ఇది. ఇది చాలా సింపుల్ గా ఉండి అన్ని రకాల వంటకాలతో సెట్ అవుతుంది.
  5. కంకోణ్ (Kankonn): ఇది గాజుల మాదిరిగా రింగ్ ఆకారంలో ఉంటుంది. టీ లేదా కాఫీలో ముంచుకుని తింటే చాలా కరకరలాడుతూ రుచిగా ఉంటుంది.
  6. గోడ్ పావ్ (Godd Pao):ఇది చాలా మెత్తగా, కొద్దిగా తీపి రుచిని కలిగి ఉంటుంది. దీనిని ఉదయం అల్పాహారంగా లేదా స్నాక్ లాగా తీసుకుంటారు.
  7. పోయి (Poei):సమీరా కూతురు నైరాకు ఇష్టమైన వెరైటీ ఇదే. ఇది గోధుమ పిండి మరియు గోధుమ పొట్టుతో తయారవుతుంది. ఇది పాకెట్ లాగా ఉండి చాలా మెత్తగా ఉంటుంది.

“ఈ సామాన్యమైన రొట్టెలు గోవా ప్రజల దైనందిన జీవితంలో ఎంతో లోతుగా పాతుకుపోయాయి” అని సమీరా పేర్కొన్నారు. కొత్త విషయాలను నేర్చుకోవడం, స్థానిక సంస్కృతిని గౌరవించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయని ఆమె అన్నారు. సమీరా రెడ్డి పంచుకున్న ఈ ఫుడ్ టూర్ గోవా వెళ్లే పర్యాటకులకు ఒక మంచి గైడ్ లా పనిచేస్తుందనడంలో సందేహం లేదు.

Follow Us