రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం ‘కాంతారా’. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై.. ఒక్క కన్నడంలోనే కాదు.. తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లోనూ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. భాషతో సంబంధం లేకుండా విడుదలైన అన్ని చోట్లా ప్రభంజనం సృష్టించి బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలు కొట్టింది ఈ సినిమా. చూసిన వారు సైతం వన్స్ మోర్ అంటూ చాలా రోజుల పాటు అన్ని రకాల ప్రేక్షకులు థియేటర్లకు వరుసపెట్టి క్యూ కట్టారు. రూ. 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించడం విశేషం. కర్ణాటకలో అయితే ఏకంగా కేజీఎఫ్-2 రికార్డును సైతం బ్రేక్ చేసింది.
ఇంతటి సూపర్ హిట్ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేసింది. ‘కాంతారా’ ఓటీటీ రిలీజ్‌పై సస్పెన్స్ వీడింది. గురువారం(నవంబర్ 24) అర్ధరాత్రి 12 గంటల నుంచి తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. మరోవైపు థియేటర్లలోనే రికార్డులు బ్రేక్ చేసిన ఈ సినిమా.. ఓటీటీలో సైతం మొదటి రోజే మిలియన్లలో వ్యూస్ దక్కించుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు. కాగా, రిషబ్ శెట్టి హీరోగా నటించిన ఈ మూవీని హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగండుర్ నిర్మించారు. ఈ చిత్రం కన్నడంలో సెప్టెంబర్ 30వ తేదీన విడుదల కాగా.. తెలుగులో అక్టోబర్ 15న రిలీజ్ చేశారు.