AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi Movie Review : పెద్ది సినిమా రివ్యూ.. విలేజ్ డ్రామాతో రామ్ చరణ్ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడా..?

మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బుధవారం రాత్రి నుంచే ప్రీమియర్స్ పడగా.. జూన్ 4న అడియన్స్ ముందుకు వచ్చింది ఈ చిత్రం. స్పోర్ట్ డ్రామాగా భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

Peddi Movie Review : పెద్ది సినిమా రివ్యూ.. విలేజ్ డ్రామాతో రామ్ చరణ్ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడా..?
Peddi Movie
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jun 04, 2026 | 6:17 AM

Share

మూవీ రివ్యూ: పెద్ది

నటీనటులు: రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, దివ్యేందు, జగపతిబాబు, బోమన్ ఇరానీ తదితరులు

ఎడిటర్: నవీన్ నూలీ

సినిమాటోగ్రఫీ: రత్నవేలు

సంగీతం: ఏఆర్ రెహమాన్

నిర్మాత: వెంకట సతీష్ కిలారు

సమర్పణ: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బుచ్చిబాబు

రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన పెద్ది సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

విజయనగరానికి కూత వేటు దూరంలో ఉన్నా కూడా కొండ కింద ఊరు కావడంతో కనీసం మనుషుల్లా కూడా గుర్తించరు పెద్ది (రామ్ చరణ్), అతని ఊరిని. ఆ ఊరికి కనీసం గుర్తింపు తీసుకురావాలని, ఊళ్లో రైలు ఆగితే తమ బతుకులు బాగుపడతాయని 30 ఏళ్లుగా పోరాటం చేస్తూ ఉంటాడు అప్పలసూరి (జగపతిబాబు). మరోవైపు కొండ కింది నుంచి విజయనగరానికి వచ్చి పనిచేసుకొని బతుకుతూ ఉంటారు పెద్ది ఊరు జనం. పెద్ది క్రికెట్ బాగా ఆడతాడు అని తెలిసి అతన్ని వేలంపాటలో కొనుక్కుంటూ ఆ ఊరి జనం మ్యాచ్ లాడుతుంటారు. ఇక అదే ఊర్లో ఉండే ఒక పొలిటికల్ లీడర్ కూతురు అచ్చియమ్మా (జాన్వీ కపూర్)ను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు పెద్ది. అదే సమయంలో క్రికెట్ వదిలేసి కుస్తీ వైపు అడుగులు వేస్తాడు.. అక్కడినుంచి రన్నింగ్ వైపు వస్తాడు. కొండ కింది ఊరు నుంచి ఢిల్లీ వరకు పెద్ది ప్రయాణం సాగుతుంది. ఇదంతా ఎందుకోసం.. ఊరి కోసం పెద్ది ఏం చేశాడు అనేది అసలు కథ..

కథనం:

కమర్షియల్ సినిమా చేయడానికి చాలా మంది హీరోలున్నారు.. కానీ కథ నడిపించే సినిమా చేయాలంటే కమర్షియల్ హీరోకు ధైర్యముండాలి. ఆ ధైర్యం చేసాడు రామ్ చరణ్.. పెద్ది సినిమా కాదు ఓ ఎక్స్‌పీరియన్స్. బుచ్చిబాబు సినిమా తీయలేదు.. ఓ అద్భుతమైన ఎమోషనల్ కథ చెప్పాడు. సినిమాలో హై మూవెంట్స్ కోసం వెతకొచ్చు కానీ కథలో ఎత్తులు పల్లాలు రెండూ ఉంటాయి. పెద్ది అలాంటి ఓ అందమైన కథ. ఇందులో ఎత్తులే ఉన్నాయని చెప్పలేము.. పల్లాలు కూడా ఉన్నాయి. కానీ ఆ లోతుల్ని మరిపించేలా పెద్దిని చివర్లో పై ఎత్తులో కూర్చోబెట్టాడు బుచ్చిబాబు. తీసుకున్న కథ పాతదే.. గుర్తింపు కోసం ఓ కుర్రాడు చేసే పోరాటమే ఈ సినిమా. తన పోరాటానికి ఆటను ఆయుధంగా, అస్త్రంగా వాడుకుంటాడు. పెద్ది గాడు తన ఆటతో ఏం చేసాడు.. ఊరి భవిష్యత్తు ఎలా మార్చేసాడు అనేది ఈ చిత్ర కథ.

చెప్పడానికి చాలా సింపుల్ కానీ.. బుచ్చిబాబు దీన్ని తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. ఫస్టాఫ్ అంతా కమర్షియల్ పంథాలో నడిపించాడు.. క్రికెట్ సీన్స్ అన్నీ బాగానే వర్కవుట్ అయ్యాయి. మధ్యలో కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నా కూడా.. ఇంటర్వెల్ నుంచి అసలు కథ మొదలవుతుంది. ఒక్కసారి కుస్తీ మొదలయ్యాక కథలో వేగం పెరుగుతుంది.. క్లైమాక్స్‌కు వచ్చేసరికి ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. సినిమా అంతా రామ్ చరణ్ ఒక్కడే తన భుజాలపై నడిపించాడు. తను చెప్పాలనుకున్న కథను.. ఎక్కడా డీవియేట్ కాకుండా చాలా గొప్పగా, హానెస్ట్‌గా చెప్పాడు బుచ్చిబాబు. రామ్ చరణ్ కూడా తన దర్శకుడు చెప్పిందల్లా కళ్లు మూసుకుని చేసుకుంటూ పోయాడు. కథ క్లైమాక్స్‌కు వచ్చేసరికి తెలియకుండానే బరువైన ఎమోషన్స్ మనసులో మొదలవుతాయి. ముఖ్యంగా ఒక్కడే మూడు ఆటలు ఎందుకు ఆడాల్సి వచ్చింది.. క్రాస్ ఓవర్ అథ్లెట్ ఎందుకయ్యాడు అనేది చాలా కన్విన్సింగ్ గా చెప్పాడు బుచ్చిబాబు. క్లైమాక్స్ లో కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్నట్టే అదే సీన్ పెట్టాడు. అది సినిమాలో చూసి మీరు తెలుసుకోండి. బాలీవుడ్ నటుడు దివ్యేందు క్యారెక్టర్ గురించి కాస్త ఎక్కువగానే మాట్లాడాలి కానీ సినిమాలో మాత్రం తక్కువగానే ఉంది అతడి పాత్ర. అత్యంత కీలకమైన పాత్ర పోషించింది జగపతిబాబు అప్పలసూరి.. అలాగే శివరాజ్ కుమార్ పోషించిన గౌర్నాయుడు. రామ్ చరణ్ కి ఈ రెండు పాత్రలతో ఉన్న సన్నివేశాలు చాలా బాగుంటాయి. ఓవరాల్ గా ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ తోనే థియేటర్లో నుంచి ప్రేక్షకులను బయటికి పంపించాడు బుచ్చిబాబు.

నటీనటులు:

రామ్ చరణ్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టాడని చెప్పడం కూడా చిన్నమాటే అవుతుంది. ఒక్కటైతే నిజం.. రంగస్థలం సిట్టిబాబునే మరిపించే పాత్ర అయితే ఇందులో చరణ్ చేసాడు. శివరాజ్ కుమార్ పాత్ర కూడా చాలా బాగుంది.. జాన్వీ కపూర్, దివ్యేందు క్యారెక్టర్స్ ఓకే. అప్పల సూరిగా జగపతిబాబు చాలా మంచి పాత్ర చేసాడు. మిగిలిన క్యారెక్టర్స్ అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ టీం:

ఈ సినిమాలో తెరపై కనిపించే హీరో రామ్ చరణ్ అయితే.. తెరవెనక నడిపించిన హీరో AR రెహ్మాన్. ఆయన రీ రికార్డింగ్ చాలా రీ ఫ్రెషింగ్‌గా అనిపించింది.. సినిమా స్థాయిని పెంచేసింది. రత్నవేలు సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకు ప్రాణం. నవీన్ నూలి ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉంటే బాగుండేది.. కానీ దర్శకుడు నిర్ణయం కాబట్టి అతడిని తప్పు పట్టడానికి లేదు. బుచ్చిబాబు తన వంతు ప్రయత్నం చాలా సిన్సియర్‌గా చేసాడు.. హీరో దొరికాడు కదా అని కమర్షియల్‌గా కాకుండా మంచి కథ చెప్పాడు. గ్రాఫిక్స్ విషయాల్లో అక్కడక్కడా చూసుకోవాల్సిందే. వృద్ధి సినిమాస్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా పెద్ది.. మనసును కదిలించే కొండ కింద ఊరోడి కథ..!

Follow Us