
మూవీ రివ్యూ: అనగనగా ఒకరాజు
నటీనటులు: నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి, రావు రమేష్, ఛమ్మక్ చంద్ర, తారక్ పొన్నప్ప, జబర్దస్త్ మహేష్ తదితరులు
సంగీతం: మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రఫీ: జే యువరాజ్
ఎడిటింగ్: గాంధీ ఎన్
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: నవీన్ పొలిశెట్టి
దర్శకుడు: మారి
నిర్మాతలు: నాగవంశీ, సాయి సౌజన్య
జాతి రత్నాలు, మిస్ శెట్టి లాంటి సినిమాల తర్వాత నవీన్ పొలిశెట్టి నటించిన సినిమా అనగనగా ఒకరాజు. మూడేళ్ల గ్యాప్ తీసుకుని నవీన్ చేసిన సినిమా ఇది. సంక్రాంతి బేస్ చేసుకుని వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..
ఊర్లో జమిందారీ వంశంలో పుట్టిన రాజుగారు (నవీన్ పొలిశెట్టి) పూర్తి అప్పుల్లో ఉంటారు. తాత చేసిన పనుల కారణంగా ఆస్తులన్నీ అలా కరిగిపోతాయి. దాంతో ఎలాగైనా డబ్బున్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని లైఫ్ సెటిల్ చేసుకోవానలి చూస్తుంటాడు రాజు గారు. అదే సమయంలో పక్కూరు భూపతి రాజుగారి కూతురు చారులత (మీనాక్షి చౌదరి) రాజు లైఫ్‌లోకి వస్తుంది. ఆమెను చూసి ప్రేమలో పడతాడు రాజు. ప్లాన్ చేసి మరీ పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆ తర్వాతే చారు కుటుంబం గురించి అసలు నిజం తెలుస్తుంది. ఆ తర్వాత రాజు గారి లైఫ్ ఎలా మారిపోయింది.. ఆ ఊర్లో జరిగిన ఎలక్షన్స్‌కి హీరోకి ఉన్న లింక్ ఏంటి.. అనేది మిగిలిన కథ..
గ్యాప్ ఇవ్వరా.. గ్యాప్ ఇవ్వు.. అంతా నువ్వే చేస్తే అంటే ఎలా..? అనగనగా ఒకరాజులో నవీన్ పొలిశెట్టిని చూసాక ఇదే అనిపిస్తుంది. అస్సలు ఎవరికీ ఛాన్స్ ఇవ్వలేదు రాజుగారు.. కథ లేదు.. కథనం లేదు.. ఓన్లీ బుల్లెట్ బండిలా నవీన్ డైలాగులే పేలాయి థియేటర్లో..! కాకపోతే మనోడు ఎంత పర్పార్మ్ చేసిన పక్కన ఇంకో క్యారెక్టర్ అంతే స్థాయిలో ఉండుంటే బాగుండేది. అక్కడ స్కోప్ లేకపోయినా.. దూసుకెళ్లిపోయాడు పొలిశెట్టి.. కేవలం పండగను దృష్టిలో పెట్టుకుని చేసిన పండగ సినిమా ఇది. స్టార్టింగ్ సీన్ నుంచే లీడ్ తీసుకున్నాడు నవీన్.. మైలేజ్ లేని చోట కూడా నడిపించాడు. ఫస్టాఫ్ అంతా కేవలం స్కిట్స్ మాదిరి ఎపిసోడ్స్ తరహాలో వెళ్తుంది కథ. సెకండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది.. క్లైమాక్స్ ఊహించని టర్న్ తీసుకుంటుంది. అప్పటి వరకు చూసిన కామెడీ సినిమా కాస్తా.. చివర్లో ఎమోషనల్ వైపు అడుగులేసింది. మంచి సినిమా అనిపించుకోడానికి ఇలాంటి ముగింపు ఇచ్చారేమో అనిపించింది. నవీన్ పొలిశెట్టి ఫుల్ పొటెన్షియాలిటీ వాడుకునేంత దమ్ము కథలో లేదు.. అందుకే కథ, కాకరకాయతో పని లేకుండా అంతా తానే చూసుకున్నాడు ఈయన. ఈ సినిమా కథ ఇది అని కచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే కథ కంటే ఎక్కువగా మూవెంట్స్ మీద వెళ్లిపోయింది సినిమా. ముఖ్యంగా ఊరు ఎలక్షన్స్.. అక్కడ సమస్యలు.. సోషల్ మీడియా ఎఫెక్ట్ అంటూ సెకండాఫ్ మొత్తాన్ని అలాగే నడిపించాడు నవీన్. మొత్తంగా పండక్కి నవ్వుకోడానికి చేసిన ప్రయత్నం ఇది.
చెప్పాం కదా.. నవీన్ పొలిశెట్టి నడిపించాడు సినిమా మొత్తాన్ని. ఉన్న అన్ని రీల్స్ ఆయనే కనిపించాడు. మీనాక్షి చౌదరి అమాయకంగా స్క్రీన్ మీద చాలా బాగుంది.. నవీన్ తర్వాత గుర్తుపెట్టుకునే క్యారెక్టర్ మరోటి లేదు సినిమాలో. రావు రమేష్, తారక్ పొన్నప్ప, జబర్దస్త్ మహేష్, ఛమ్మక్ చంద్ర అంతా తమ పాత్రలకు న్యాయం చేసారు.
మిక్కీ జే మేయర్ సంగీతం బాగుంది.. పాటలు బాగానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ వర్క్ పర్లేదు. ఎడిటింగ్ ఓకే.. ఫస్టాఫ్ ఇంకాస్త షార్ప్‌గా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. దర్శకుడు మారి పూర్తిగా నవీన్ పొలిశెట్టికి సపోర్ట్ చేసాడు.. నవీన్ కూడా ఉన్న కథను ఎంటర్‌టైనింగ్‌గా చెప్పే ప్రయత్నం చేసాడు.
ఓవరాల్‌గా అనగనగా ఒకరాజు.. అంతా రాజుగారే.. పండగ బొమ్మ..!