Honey Review: హనీ మూవీ రివ్యూ.. నవీన్ చంద్ర దెయ్యం పూజాలు ఫలించాయా..?
పలాస 1978 లాంటి సహజసిద్ధమైన చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్.. ఆ తర్వాత రూట్ మార్చాడు. మనిషి బలహీనతలను టార్గెట్ చేస్తూ ఒక సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ జోనర్‌ను ఎంచుకున్నాడు. విలక్షణ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నవీన్ చంద్ర లీడ్ రోల్‌లో నటించిన హనీ ఫిబ్రవరి 6, 2026న థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఏ మేరకు భయపెట్టిందో రివ్యూలో చూద్దాం.

మూవీ రివ్యూ: హనీ
నటీనటులు: నవీన్ చంద్ర, దివ్య పిళ్లై, దివి వాద్త్యా, రాజా రవీంద్ర, బేబీ జయన్ని తదితరులు
సంగీతం: అజయ్ అరసాడ
నిర్మాణం: రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి
దర్శకత్వం: కరుణ కుమార్
కథ:
మధ్యతరగతి కష్టాలతో సతమతమయ్యే సామాన్యుడు ఆనంద్ (నవీన్ చంద్ర). ఉద్యోగం లేక, చేతిలో చిల్లీగవ్వ లేక అల్లాడిపోతుంటాడు. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశ, దానికి తోడు పరిస్థితుల ఒత్తిడి అతన్ని తప్పుడు మార్గం పట్టిస్తాయి. అదృష్టం కలిసొస్తుందనే నమ్మకంతో క్షుద్రశక్తుల వైపు మొగ్గు చూపుతాడు. ఈ విపరీతమైన ఆచారాల్లోకి తన భార్య లలిత (దివ్య పిళ్లై), చిన్నారి కూతురు మీరా (బేబీ జయన్ని)ను కూడా లాగుతాడు. అయితే ఇంటి పరిస్థితులు మారుతున్న క్రమంలో.. తన కూతురు ఎవరితోనో మాట్లాడుతున్నట్లు.. ‘హనీ’ అనే పేరు కలవరిస్తున్నట్లు ఆనంద్ గుర్తిస్తాడు. ఇంతకీ ఆ హనీ ఎవరు..? ఆనంద్ అత్యాశ ఆ కుటుంబాన్ని ఏ ప్రమాదంలోకి నెట్టింది..? మూఢనమ్మకాల వలయం నుండి ఆనంద్ కుటుంబం బయటపడిందా? అనేదే తెరపై చూడాల్సిన కథ.
కథనం:
దెయ్యం బయటెక్కడో ఉండదు.. మనిషిలోని భయం, దురాశలోనే ఉంటుంది అనే బలమైన పాయింట్‌తో దర్శకుడు కరుణ కుమార్ ఈ చిత్రాన్ని మలిచాడు. మదనపల్లెలో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఛాయలు ఈ కథలో కనిపిస్తాయి. రెగ్యులర్ హారర్ సినిమాల్లోలాగా భయపెట్టడం కంటే, మానసిక సంఘర్షణతో భయం పుట్టించే ప్రయత్నం చేశారు. కథను నడిపించిన విధానం, సౌండ్ డిజైన్ కమ్ బ్యాగ్రౌండ్ స్కోర్, క్లైమాక్స్ ఎపిసోడ్ హనీ సినిమాకు బాగానే కలిసొచ్చే అంశాలు. ద్వితీయార్ధంలో సాగదీత సన్నివేశాలు, మితిమీరిన వయొలెన్స్, కాస్త గందరగోళంగా అనిపించే కొన్ని ట్విస్టులు ఈ సినిమాకు పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. మొదటి నుంచి కథనం మాత్రం వేగంగానే వెళ్తుంది. కథ ఎటువైపు వెళ్తుందనేది ఓ పట్టాన అర్థం కాదు.. సెకండాఫ్ మొదలైన తర్వాత గానీ అసలు కథ రివీల్ చేయలేదు దర్శకుడు. అప్పటి వరకు బాగానే వెళ్తుంది కథ. కానీ స్టోరీ రివీల్ అయిన తర్వాత మాత్రం కథనం నెమ్మదించింది. కాకపోతే దెయ్యాలు, చేతబడులు కాకుండా.. ఇందులో మరో కోణం చూపించాడు కరుణ కుమార్. పిల్లులు, అవి గర్భంతో ఉండటం.. అలాంటి సమయంలో వాళ్లు చేసే పనులు చూస్తుంటే భయమేస్తుంది. హనీ అనేది రెగ్యులర్ కమర్షియల్ హారర్ సినిమా కాదు. ఇది మూఢనమ్మకాల వల్ల కలిగే అనర్ధాలను కళ్లకు కట్టే ఒక డార్క్ థ్రిల్లర్. హారర్ జానర్‌ను, కొత్తదనాన్ని కోరుకునే వారికి, టెక్నికల్ వ్యూల్యూస్ ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఫ్యామిలీ ఆడియన్స్‌కు, ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారికి ఇది కాస్త భారంగా అనిపించవచ్చు.
నటీనటులు:
ఈ సినిమాకు ప్రధాన బలం నవీన్ చంద్ర. ఒక సగటు నిరుద్యోగిగా మొదలై.. క్షుద్రపూజల మాయలో పడి మానసిక స్థితి కోల్పోయిన వ్యక్తిగా ఆయన నటన అమోఘం. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆయన హావభావాలు వెన్నులో వణుకు పుట్టిస్తాయి. దివ్య పిళ్లై గృహిణి పాత్రలో ఒదిగిపోయింది. ఇక బిగ్‌బాస్ ఫేమ్ దివి.. ఇందులో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించింది. రాజా రవీంద్ర తన అనుభవంతో పాత్రకు న్యాయం చేశారు. చిన్న పాప కూడా బాగానే చేసింది.
టెక్నికల్ టీం:
టెక్నికల్ పరంగా సినిమా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అజయ్ అరసాడ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్‌ని ఎలివేట్ చేసింది. నిశబ్దంలో వచ్చే సౌండ్స్ థియేటర్‌లో మంచి అనుభూతినిస్తాయి. నగేష్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు మరో ఎస్సెట్. లైటింగ్ వాడిన విధానం, డార్క్ థీమ్‌ను ప్రెజెంట్ చేసిన తీరు బాగుంది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. దర్శకుడు కరుణ కుమార్ ప్రయత్నం పర్లేదు..
పంచ్ లైన్:
ఓవరాల్‌గా హనీ.. కాస్త భయం.. డిఫెరెంట్ హార్రర్ జోనర్..!
